AP News: ఏపీలో కేంద్ర పథకాలు మినహా అభివృద్ధి జరగట్లేదు: కిషన్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Updated : 24 Sep 2022 17:05 IST

తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర వాటా నిధులు లేక కొన్ని కేంద్ర పథకాల పనుల్లో జాప్యం జరుగుతోందని చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘కేంద్ర పథకాలు మినహా రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదు. జల వివాదాలను తెలుగు రాష్ట్రాలు పరిష్కరించుకోవాలి. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలనేది కేంద్రం భావన. కరోనా సమయంలో ఏపీకి 4,500 వెంటిలేటర్లు, ఇంజెక్షన్లను కేంద్రం పంపింది. రాష్ట్రానికి అనేక విద్యాసంస్థలను మంజూరు చేసింది. విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అభివృద్ధి చేసింది.

‘దేఖో అప్నా దేశ్‌’ పేరుతో పర్యాటకరంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. వచ్చే జనవరి నుంచి డిసెంబర్‌ వరకు పర్యాటకాభివృద్ధికి ప్రణాళిక రచిస్తున్నాం. కరోనా మూడో దశ రాకుండా ఉండాలంటే ప్రజల సహకారం కావాలి. వైద్యులను కలిసి వారిలో విశ్వాసం పెంపొందించాలని ప్రధాని సూచించారు. రాష్ట్రాల పర్యటన సందర్భంగా వైద్యులను కలిసి భరోసా ఇస్తున్నాం. దేశంలో చివరి వ్యక్తి వరకు ఉచితంగా వ్యాక్సిన్లు అందిస్తాం. పర్యవేక్షణ కమిటీ నేతృత్వంలో రోజువారీగా సమీక్షలు చేసి రాష్ట్రాలకు వ్యాక్సిన్లు సరఫరా చేస్తున్నాం’’ కిషన్‌రెడ్డి తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని