NEET : ‘నీట్‌’తో ప్రయోజనం శూన్యమని కేంద్రం అంగీకరించింది : స్టాలిన్‌

నీట్‌ (NEET) పీజీ మెడికల్‌ కౌన్సెలింగ్‌ మూడో రౌండ్‌లో సీట్ల భర్తీకి అర్హత మార్కులను సున్నాగా ప్రకటించడంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ (Stalin) స్పందించారు. 

Published : 21 Sep 2023 15:58 IST

చెన్నై : మెరిట్‌తో సంబంధం లేకుండా పీజీలో ప్రవేశాలు కల్పిస్తామని ప్రకటించడం ద్వారా నీట్‌తో (NEET) కలిగే ప్రయోజనం శూన్యమని కేంద్రం అంగీకరించిందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ (Stalin) వ్యాఖ్యానించారు. ‘నీట్‌ పీజీ కట్‌ ఆఫ్‌ను సున్నా చేశారు. దాంతో నీట్‌ ‘అర్హత’కు అర్థమేలేదని వారు అంగీకరిస్తున్నారు. అది కేవలం కోచింగ్ సెంటర్లు, పరీక్ష ఫీజుల కోసం పెట్టారు. ఎలాంటి అర్హతలు అవసరం లేదని’ ట్విటర్‌లో పోస్టు పెట్టారు. 

తెలుగు సినీ పరిశ్రమను వైకాపా నేతలు కించపరిచారు: బాలకృష్ణ

నీట్‌ను సున్నాతో సమానం చేసి.. మెరిట్‌ అవసరమేలేదని కేంద్రం చెబుతోంది. అది కేవలం అలంకారప్రాయమని మేము ఎప్పటి నుంచో చెబుతున్నామని స్టాలిన్‌ పేర్కొన్నారు. ఆ పరీక్షలో నిజమైన అర్హత ప్రమాణాలులేవని ఆయన విమర్శించారు. నీట్‌ పరీక్షలో అనుసరిస్తున్న విధానాల కారణంగా గతంలో ఎంతో మంది విద్యార్థుల ప్రాణాలు పోయినా లెక్కచేయని భాజపా ప్రభుత్వం.. కొత్తగా ఈ ఉత్తర్వులను తీసుకొచ్చిందని పేర్కొన్నారు. నీట్‌ అనే జిలెటిన్‌తో ప్రాణాలు తీసిన భాజపాను ప్రజలు తిరస్కరించాలని ఆయన కోరారు.

నీట్‌ పీజీ మెడికల్‌ కౌన్సెలింగ్‌లో మూడో రౌండ్‌కు సీట్ల ఎంపికలో మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ(ఎంసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రౌండ్‌లో సీట్ల భర్తీకి అర్హత మార్కులను సున్నాగా పేర్కొంది. అన్ని కేటగిరీలకు ఈ తగ్గింపు వర్తిస్తుందని తెలిపింది. కటాఫ్‌ మార్కులను తొలగించిన నేపథ్యంలో మూడో రౌండ్‌లో పీజీ సీట్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు ఎంసీసీ పేర్కొంది. ఇప్పటికే మూడో రౌండ్‌లో సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, ఆప్షన్లను మాత్రం మార్చుకోవచ్చని సూచించింది. అర్హత పర్సంటైల్‌ను తగ్గించిన కారణంగానే మూడో రౌండ్‌లో సీట్ల కోసం దరఖాస్తుకు అవకాశం కల్పించామంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ నిర్ణయం మేరకు అర్హత పరీక్షల మార్కులను సున్నాకు తగ్గించామంది. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని