
GST: ఆ భయం వల్లే వస్త్రాలపై జీఎస్టీ పెంపు వాయిదా!
భాజపాకు గెలుపు, ఓటమి భాషే అర్థమవుతుందన్న కాంగ్రెస్
దిల్లీ: దేశంలో వస్త్రాలపై జీఎస్టీ రేటును 5 శాతం నుంచి 12 శాతానికి పెంచాలనే నిర్ణయాన్ని కేంద్రం తాత్కాలికంగా వాయిదా వేయడంపై కాంగ్రెస్ స్పందించింది. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, టెక్స్‌టైల్ హబ్‌గా పేర్గాంచిన గుజరాత్‌లో డిసెంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో ఓడిపోతామనే భయం వల్లే ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికారప్రతినిధి పవన్ ఖేరా దిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితుల నేపథ్యంలో కొత్త ఏడాది సుసంపన్న సంవత్సరం కావాలని ప్రజలు కోరుకోవడం అబద్ధమే అవుతుందన్నారు.
ఈ ఏడాదిలో చెప్పులు, ఆన్‌లైన్ ఆటో బుకింగ్, ఏటీఎం సర్వీస్ ఛార్జీలు, సిమెంట్, స్టీల్ తదితర వస్తువుల ధరలు మరింత ప్రియం కానున్నాయని పవన్ ఖేరా చెప్పారు. దేశంలో నిత్యవసరాల ధరలు పెరుగుదలను అడ్డుకోవాలంటే ప్రధాని మోదీకి ఎన్నికల్లో ఓటమి రుచి చూపించడం ఒక్కటే మార్గమన్నారు. భాజపాకు ఓటు, గెలుపోటముల భాష మాత్రమే అర్థమవుతుందని, ఆ పార్టీకి ప్రజల శ్రేయస్సుతో పనిలేదంటూ ఆరోపించారు. రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాతే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడం, వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేసుకోవడం వంటి అంశాల్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
► Read latest Political News and Telugu News