Chandrababu: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపాకి తగిన గుణపాఠం చెప్పాలి: చంద్రబాబు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు ఆయన బహిరంగ లేఖ రాశారు.

Published : 11 Mar 2023 15:59 IST

అమరావతి: ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న వైకాపా(YSRCP)కి  ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC elections)బుద్ధి చెప్పి... తెలుగుదేశం (TDP) అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) కోరారు. ఎన్నికల్లో ప్రలోభాలు, బోగస్ ఓట్లతో వైకాపా అక్రమాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు ఆయన బహిరంగ లేఖ రాశారు.  జగన్ ప్రభుత్వం హక్కులను కాలరాస్తూ తమను ఎలా మోసం చేసిందో ఉద్యోగులు, టీచర్లు గుర్తించి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్‌, భూంరెడ్డి రామ్‌గోపాల్‌ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 

ప్రభుత్వం ఎలా మోసం చేసిందో గ్రహించాలి..

‘‘2014లో తెదేపా అధికారంలోకి వచ్చాక అనేక సవాళ్లను అధిగమించాం. క్లిష్ట పరిస్థితులు, సవాళ్లను అధిగమించి పెట్టుబడులు తీసుకొచ్చాం. నాడు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోనే దాదాపు 10లక్షల ఉద్యోగాలు ఇచ్చి యువత భవితకు బాటలు వేశాం. నేడు ప్రభుత్వ టెర్రరిజంతో పరిశ్రమలు పారిపోయి.. నిరుద్యోగం పెరిగిపోయింది. జాబ్ క్యాలెండర్, డీఎస్సీ గురించి ప్రభుత్వం ఎలా మోసం చేసిందో అంతా గ్రహించాలి. నాడు విభజన కష్టాలు ఉన్నా ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చాం. నేడు ప్రభుత్వ ఉద్యోగులకు అడిగినంత ఫిట్‌మెంట్‌ కాదు కదా.. కనీసం ఏనెల జీతం ఆ నెల ఇచ్చే పరిస్థితి కూడా లేదు. టీచర్లకు లిక్కర్ షాపుల వద్ద డ్యూటీలు వేసిన ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో టీచర్లు బుద్ధి చెప్పాలి. స్థానిక సంస్థల ఎన్నికల తరహాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున అక్రమాలకు, ఫోర్జరీలకు వైకాపా తెరతీసింది. దొంగ అడ్రస్‌లు, ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి నిరక్షరాస్యులను పట్టభద్రుల ఓటర్లుగా నమోదు చేశారు. ఒక్క తిరుపతి నగరంలోనే 7వేలకు పైగా దొంగ ఓట్లు చేర్పించారు’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెలుగుదేశం.. పీడీఎఫ్‌తో ఒక అవగాహనకు వచ్చిందన్నారు. పట్టభద్రుల స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపాకు మొదటి ప్రాధాన్య ఓటు వేసి.. రెండో ప్రాధాన్య ఓటు పీడీఎఫ్ అభ్యర్థులకు వేయాలని ప్రజలను, తెలుగుదేశం మద్దతుదారులను కోరారు. ఇదే సందర్భంలో పీడీఎఫ్ అభ్యర్ధులకు ఓటు వేసిన ఓటర్లను వారి రెండో ప్రాధాన్య ఓటు తెదేపాకు  వేయాలని సూచించారు. ఓటు చీలిపోవడం ద్వారా దుర్మార్గమైన వైకాపా ఎట్టి పరిస్థితుల్లోను గెలవడానికి వీలు లేదని ఆయన తేల్చి చెప్పారు. అందుకే రెండో ప్రాధాన్య ఓటు విషయంలో పరస్పర మార్పిడి జరగాల్సి ఉందన్నారు. పతనం అంచులో ఉన్న రాష్ట్ర పునర్నిర్మాణానికి బాధ్యతతో, చైతన్యంతో ఓటు వేసి అధికార పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని ఉపాధ్యాయులు, పట్టభద్రులకు  చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని