Updated : 12 Apr 2022 13:26 IST

Andhra News: సీఎం జగన్‌తో ముగిసిన సమావేశం.. అలక వీడిన బాలినేని

అమరావతి: బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి ‘మంత్రి పదవి’ పంచాయితీ కొలిక్కి వచ్చింది. పదవి రాలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్న బాలినేని శ్రీనివాస్‌ రెడ్డిని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పలుమార్లు కలిసి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం రాలేదు. దీంతో బాలినేనిని... సీఎం తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని మాట్లాడారు. మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదనే విషయంపై బాలినేనికి సీఎం జగన్‌ వివరించారు. ముందుగా కొత్త కేబినెట్‌లో ఐదు నుంచి ఆరుగురు పాత మంత్రులను మాత్రమే కొనసాగించాలని అనుకున్నామని... అయితే చివరి నిమిషంలో సమీకరణాల నేపథ్యంలో కొంతమంది సీనియర్లకు మరోసారి అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినట్లు జగన్‌ చెప్పినట్లు సమాచారం. మంత్రి పదవి రాలేదని బాధపడాల్సిన అవసరం లేదని.. భవిష్యత్తులో పార్టీ మరోసారి అధికారంలోకి రాగానే మంత్రి పదవి ఇస్తానని బాలినేనికి సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజకీయాల నుంచి దూరంగా వెళ్లాలనే ఆలోచనలు మానేసి అందరినీ కలుపుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిందిగా బాలినేనిని సీఎం జగన్‌ బుజ్జగించినట్లు తెలుస్తోంది.

సమావేశం అనంతరం బాలినేని శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ‘‘మేము వైకాపా, వైఎస్‌ఆర్‌ కుటుంబం, జగన్‌కు విధేయులం. మంత్రి పదవి అనేది సీఎం ఆలోచన మేరకు ఉంటుంది. మంత్రి పదవి కోసం ఎప్పుడూ అర్రులు చాచే పరిస్థితి లేదు. అందరికీ పదవులు ఒకేసారి రావు. సమయానుకూలంగా అవే వస్తాయి. ఆదిమూలపు సురేశ్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవు. సురేశ్‌కు మంత్రి పదవి ఇస్తే నేను అలకబూనానని అనడం అవాస్తవం. సురేశ్‌, నేను మంత్రులుగా కలసి పని చేశాం. మంత్రి సురేశ్‌తో కలసి పనిచేసేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. జగన్‌ నాయకత్వంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. 25 మందిని తీసేస్తారని తొలుత చెప్పింది నేనే. సమర్థత ఉన్న నాయకులనే మంత్రివర్గంలోకి తీసుకున్నారు. నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు. కొత్త మంత్రులు మంచి పేరు తీసుకువస్తారని ఆశిస్తున్నా’’ అని చెప్పారు.

‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది. సీఎం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాను. కొత్త మంత్రి వర్గానికి అందరూ మద్దతివ్వాలి. కొత్త కేబినెట్‌లో 11 మంది పాతవారు, 14 మంది కొత్త మంత్రులు ఉన్నారు. ఎక్కడా లేని విధంగా సామాజిక న్యాయం జరిగింది. ప్రకాశం జిల్లాలో పార్టీ బాధ్యతలు నిర్వహిస్తా. జగన్‌ ఇచ్చిన బాధ్యతలను నెరవేరుస్తాను. అందరూ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నా. అనుచరులు చేసిన రాజీనామాలు విరమించుకుంటారు. వచ్చే ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ సీట్లు రావడానికి కృషి చేస్తాను. నాతో కలసి భోజనం చేసేందుకే సజ్జల మా ఇంటికి వచ్చారు. నేను సజ్జల తరచూ కలసి మాట్లాడుకుంటూనే ఉంటాం’’ అని బాలినేని పేర్కొన్నారు.

ఉదయభానుకు న్యాయం జరుగుతుంది: మోపిదేవి

మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తితో ఉన్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుని ఎంపీ మోపిదేవి వెంకటరమణ బుజ్జగించారు. గంటకుపైగా ఉదయభాను ఇంట్లో మోపిదేవి మంతనాలు జరిపారు. అనంతరం మోపిదేవి మాట్లాడుతూ.. ‘‘కేబినెట్ కూర్పులో కొంతమంది ఆశావహులకు మంత్రి పదవి ఇవ్వలేదు. 70 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సామాజిక వర్గాల వారికి ప్రాధాన్యత ఇచ్చారు. సీనియార్టీని సీఎం జగన్‌ గౌరవమిస్తారు. త్వరలో ముఖ్యమంత్రి దగ్గరికి ఉదయభాను వెళ్తారు. త్వరలోనే సామినేని ఉదయభానుకు న్యాయం జరుగుతుంది. కార్యకర్తలందరూ సమన్వయం పాటించాలి. ప్రతి శాసనసభ్యుడికి మంత్రిగా ప్రజాసేవ చేయాలనే ఉంటుంది’’ అని మోపిదేవి పేర్కొన్నారు.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts