Cm Kcr: విద్యావ్యవస్థలో దిల్లీ తరహా విధానాలు దేశానికి అవసరం: సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిల్లీ పర్యటన కొనసాగుతోంది. తాజాగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కేసీఆర్‌ భేటీ అయ్యారు. కేజ్రీవాల్‌తో కలిసి కేసీఆర్‌ దిల్లీలోని మోతీబాగ్‌లో

Published : 21 May 2022 20:47 IST

దిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిల్లీ పర్యటన కొనసాగుతోంది. తాజాగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కేసీఆర్‌ భేటీ అయ్యారు. కేజ్రీవాల్‌తో కలిసి కేసీఆర్‌ దిల్లీలోని మోతీబాగ్‌లో ఉన్న సర్వోదయ ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. సీఎం కేజ్రీవాల్‌ స్వయంగా కేసీఆర్‌కు సర్వోదయ పాఠశాలను చూపించారు. అనంతరం అక్కడి సిబ్బంది పాఠశాల ప్రత్యేకతలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్య, సదుపాయాలను కేసీఆర్‌కు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు.

అనంతరం కేజ్రీవాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ముఖ్యమంత్రి దిల్లీ పాఠశాలను చూసేందుకు రావడం ఎంతో సంతోషం. ఆయన పర్యటనను మేం గౌరవంగా భావిస్తున్నాం. పాఠశాల మొత్తం చూపించాం. ఎన్నో ప్రశ్నలు అడిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విద్యాశాఖపై చాలా ఆసక్తి ఉంది. తెలంగాణలో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నారు. ఇక్కడ ప్రగతి సాధిస్తున్న విషయాలు తెలుసుకునేందుకు కేసీఆర్‌ దిల్లీ వచ్చారు. తెలంగాణను చూసి మేం కూడా ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. పరస్పర అవగాహనతో నేర్చుకుంటే దేశం ఎంతో అభివృద్ధి సాధిస్తుంది’’ అని పేర్కొన్నారు.

కేసీఆర్‌ మాట్లాడేతూ.. ‘‘దిల్లీలో విద్యా వ్యవస్థ చాలా బాగుంది. స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య, మార్కులు.. ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన శిక్షణ అద్భుతంగా ఉంది. భారత్‌లో మరెక్కడా ఇలాంటి విద్యా విధానం లేదు. దిల్లీలో పిల్లలను చదివించటంలో తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. దిల్లీ ప్రజలు అదృష్టవంతులు. కేజ్రీవాల్‌ దిల్లీలో అమలు చేస్తున్న విధానాలపై చర్చించాలి. విద్యార్థులను జాబ్ సీకర్లుగా కాకుండా జాబ్ ప్రొవైడర్లుగా మార్చుతున్న విధానం చాలా బాగుంది. విద్యా వ్యవస్థలో ఇలాంటి విధానాలు పాటించడం మన దేశానికి చాలా అవసరం. తెలంగాణలోనూ ఈ విధానాన్ని అమలు చేసేలా ప్రణాళిక రూపొందిస్తాం. తెలంగాణ నుంచి త్వరలో అధికారుల బృందాన్ని పంపించి సమన్వయం చేసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం ఏకపక్షంగా ఉండరాదు. ప్రజాస్వామ్య దేశంలో చర్చలు, సంప్రదింపులు ఉండాలి. విద్యా విధానం దేశానికి అవసరమే... కానీ, ఒకరు రూపొందించి అందర్నీ అమలు చేయాలనడం సరికాదు. కేంద్రం కొత్త విధానాలు తీసుకురావొచ్చు. అవి అమలు చేసే ముందు అన్ని రాష్ట్రాలతో చర్చించి, అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇబ్బందులు తప్పవు’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని