PM Modi: కాంగ్రెస్‌కు అజెండా లేదు.. నాపై బురదజల్లడమే పని: ప్రధాని మోదీ

దేశ భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి అజెండా లేదని ప్రధాని మోదీ విమర్శించారు.

Published : 22 Feb 2024 22:05 IST

నవసారీ: కాంగ్రెస్‌ (Congress) పార్టీకి తనను దూషించడం మినహా మరో అజెండా లేదని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. దీనివల్ల భాజపా (BJP) నేతృత్వంలోని ఎన్డీయే (NDA) కూటమి లోక్‌సభ ఎన్నికల్లో (LokSabha Elections 2024) 400 సీట్లు గెలవాలనే సంకల్పం మరింత బలపడుతుందన్నారు. గుజరాత్‌ (Gujarat) పర్యటనలో భాగంగా నవసారీలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ప్రతిపక్ష కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. 

‘‘నన్ను కులం పేరుతో దూషించడం, నాపై ఆరోపణలు చేయడం తప్ప కాంగ్రెస్‌ పార్టీ వాళ్లకి మరో పని లేదు. వాళ్లు నాపై ఎంత బురద జల్లితే అందులోంచి 370కి పైగా కమలాలు  (లోక్‌సభ స్థానాలు) వికసిస్తాయి. మోదీని విమర్శించడం మినహా దేశ భవిష్యత్తు కోసం ఆ పార్టీకి ఎలాంటి అజెండా లేదు. బంధుప్రీతి, బుజ్జగింపులు, అవినీతి రాజకీయాలు లక్ష్యంగా మారినప్పుడు దేశ వారసత్వాన్ని కాపాడుకోలేరు’’ అని ప్రధాని విమర్శించారు. ఇప్పటివరకు తమ ప్రభుత్వం దేశంలో నాలుగు కోట్ల పక్కా ఇళ్లు నిర్మించిందని తెలిపారు. ఈసందర్భంగా పలు అభివృద్ధి ప్రాజెక్ట్‌లను జాతికి అంకితం చేశారు. 

రైతుల నిరసనల వేళ.. మోదీ పోస్టు

అంతకుముందు గుజరాత్‌ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (GCMMF) గోల్డెన్‌ జూబ్లీ వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. జీసీఎమ్‌ఎమ్‌ఎఫ్‌ను ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా మార్చేందుకు కృషి చేయాలని రైతులు, వాటాదారులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉన్న జీసీఎమ్‌ఎమ్‌ఎఫ్‌ ‘అమూల్‌’ (Amul) బ్రాండ్‌ పేరుతో పాలు విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ డెయిరీ రంగం రెండు శాతం వృద్ధి నమోదు చేస్తుంటే.. భారత డెయిరీ రంగం ఆరు శాతం వృద్ధిని సాధిస్తోందని ప్రధాని తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని