Congress: తెలంగాణ కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థులు వీరే

కాంగ్రెస్‌ తరఫున తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది.

Updated : 14 Feb 2024 19:29 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ తరఫున తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. రేణుకాచౌదరి, అనిల్‌కుమార్‌ యాదవ్‌ పేర్లను ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకున్నట్లు జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ ప్రకటన జారీ చేశారు. తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న బలం ప్రకారం రెండు రాజ్యసభ సీట్లు దక్కనున్నాయి. రాష్ట్రం నుంచి రాజ్యసభ సీటు ఆశిస్తోన్న నాయకులు చాలా మంది ఉన్నప్పటికీ.. అన్ని కోణాల్లో కసరత్తు చేసిన తరువాత ఈ ఇద్దరికి అవకాశం కల్పించినట్టు పీసీసీ చెబుతోంది. రానున్న లోక్‌సభ ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని వీరిని ఎంపిక చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటకలో ఖాళీ అవుతున్న మూడు స్థానాల నుంచి అజయ్‌ మాకెన్‌, సయ్యద్‌ నాసిర్‌ హుస్సేన్‌, జి.సి.చంద్రశేఖర్‌,.. మధ్యప్రదేశ్‌ నుంచి అశోక్‌ సింగ్ పోటీ చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 15(గురువారం) వరకు గడువు ఉంది.

సీనియారిటీకి దక్కిన గౌరవం..

రేణుకా చౌదరి రాజకీయాల్లో ఫైర్‌ బ్రాండ్‌గా గుర్తింపు పొందారు. 1984లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆమె 1986లో హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కి జరిగిన ఎన్నికల్లో బంజారాహిల్స్‌ నుంచి కార్పొరేటర్‌గా గెలిచారు. 1986 నుంచి 98 వరకు రెండు సార్లు రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. 1999, 2004లో ఖమ్మం లోక్‌సభ నియోజవకర్గం నుంచి ఎన్నికయ్యారు. హెచ్‌డీ దేవెగౌడ ప్రభుత్వంలో కేంద్ర ఆరోగ్య, కుటంబ సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా, 2006 నుంచి కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో  ఖమ్మం లోక్‌సభ నుంచి పోటీ చేసి నామా నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. సీనియర్‌ నేతగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రేణుకా చౌదరికి కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం రాజ్యసభ అవకాశమిచ్చింది.

యువనాయకుడిగా గుర్తింపు పొందిన అనిల్‌..

సికింద్రాబాద్‌ మాజీ ఎంపీ, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత అంజన్‌ కుమార్‌ యాదవ్‌ తనయుడే అనిల్‌ కుమార్‌ యాదవ్‌. 2015 నుంచి 2020 వరకు రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంలో భారాస ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆందోళనలు చేశారు. ఆ తర్వాత యువజన కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2023లో అదే నియోజవకర్గం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్‌లో వన్‌ ఫ్యామిలీ.. వన్‌ టికెట్‌ ఫార్ములా అమలు చేయడంతో ముషీరాబాద్‌ సీటును తండ్రికోసం త్యాగం చేశారు. తాజాగా సికింద్రాబాద్‌ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీకి ఆయన చేసిన సేవలతో పాటు యాదవ సామాజిక వర్గం కావడం.. రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక కావడానికి కలిసొచ్చినట్టు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని