Rahul Gandhi: ‘మణిపుర్‌కు ప్రధాని ఏం చేశారు?’ కేంద్ర మంత్రి వ్యాఖ్యలకు రాహుల్‌ గాంధీ కౌంటర్‌

మణిపుర్‌ (Manipur) అంశం గురించి ప్రధాని మోదీ, భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లపై కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడిన వీడియోలను కాంగ్రెస్ పార్టీ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. 

Published : 27 Jul 2023 17:04 IST

దిల్లీ: గత రెండున్నర నెలలకు పైగా హింసతో అట్టుడుకుతున్న మణిపుర్‌ (Manipur)కు ప్రధాని మోదీ(PM Narendra Modi) ఏం చేశారో చెప్పాలని కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) డిమాండ్‌ చేశారు. బుధవారం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) తనపై చేసిన వ్యాఖ్యలకు ఆయన బదులిచ్చారు. అలాగే, ఇండియా పేరుపై ప్రధాని వ్యాఖ్యలను కూడా రాహుల్‌ తప్పబట్టారు. దాంతోపాటు భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు రాహుల్‌ గాంధీ మాట్లాడిన వీడియోలను కాంగ్రెస్‌ (Congress) పార్టీ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది.

‘‘మణిపుర్‌కు ప్రధాని మోదీ ఏం చేశారు? ఆ రాష్ట్రం గురించి ఆయన ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకంటే ప్రధానికి మణిపుర్‌తో ఎలాంటి సంబంధంలేదు. వాళ్ల సిద్ధాంతాల వల్లనే మణిపుర్‌ మండుతోందని ఆయనకు తెలుసు. దేశంలో భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌.. కాంగ్రెస్‌ పార్టీల మధ్య సైద్ధాంతిక యుద్ధం జరుగుతోంది. సమాజంలోని అసమాన్యతలను తొలగించి.. రాజ్యాంగాన్ని కాపాడటం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. అధికారం కొద్ది మంది చేతుల్లో ఉండాలనేది భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ల సిద్ధాంతం. విపక్ష కూటమికి ‘ఇండియా’ అనే పేరు పెట్టగానే ప్రధాని విమర్శించడం ప్రారంభించారు. ఆ పేరు మా హృదయాల్లోంచి వచ్చింది. అధికారం కోసం భాజపా ఏమైనా చేస్తుంది. మణిపుర్‌నే కాదు దేశాన్ని కూడా తగలబెడుతుంది. దేశం బాధ గురించి ఆ పార్టీ పట్టించుకోదు. భారత్‌ జోడో యాత్రతో ఒక నినాదం ప్రారంభమైంది. భాజపా విద్వేషాన్ని వ్యాప్తిచేసే ప్రతిచోటా కాంగ్రెస్‌ పార్టీ ప్రేమ దుకాణం తెరుస్తుంది’’ అని రాహుల్‌ గాంధీ వీడియోలో పేర్కొన్నారు.  

బుధవారం రాజ్యసభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. భాజపాయేతర పాలిత రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. మణిపుర్‌లో హింసకు రాహుల్‌ గాంధీ కారణమని ఆరోపించారు. మణిపుర్‌ అంశంపై స్మృతి ఇరానీ ఎప్పుడు మాట్లాడుతారని రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ అమీ యాజ్నిక్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి స్పందిస్తూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.  ‘‘ కాంగ్రెస్‌ పాలిత ప్రాంతాల్లో మహిళలపై జరుతున్న అఘాయిత్యాల గురించి చెప్పే ధైర్యం మీకెప్పుడు వస్తుంది? రాహుల్‌ గాంధీ మణిపుర్‌ను ఎలా తగలబెట్టారో చెప్పే దమ్ము మీకుందా? కేబినెట్‌లోని మహిళా మంత్రులు మణిపుర్‌ అంశంపైనే కాదు.. రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌, బిహార్‌లో జరుగుతున్న ఘటనలపై కూడా మాట్లాడారు’’ అని స్మృతి ఇరానీ విమర్శించారు. 

మరోవైపు మణిపుర్ అంశంపై పార్లమెంట్‌(Parliament) వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. మణిపుర్ అంశంపై ఉభయ సభల కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోంది. ప్రధాని సమక్షంలోనే మణిపుర్‌ అంశంపై చర్చ జరగాలని విపక్షాలు పట్టుపట్టడంతో గురువారం ఉభయ సభలు వాయిదాపడి తిరిగి మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యాయి. అయితే, విపక్షాలు పట్టు వీడకపోవడంతో శుక్రవారం ఉదయానికి వాయిదాపడ్డాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని