Ghulam Nabi Azad: భాజపా గూటికి ఆజాద్ మేనల్లుడు

కాంగ్రెస్‌ పార్టీకి జమ్మూ కశ్మీర్‌లో గట్టి షాక్‌ తగిలింది. రాష్ట్రంలో మరో కీలక నేత భాజపా తీర్థం పుచ్చుకున్నారు. 

Published : 28 Feb 2022 01:17 IST

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ తగిలింది. కాంగ్రెస్‌ అసమ్మతి నేత గులాబ్‌ నబీ ఆజాద్‌ మేనల్లుడు ముబషిర్ ఆజాద్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడి భాజపాలో చేరారు. జమ్మూ కశ్మీర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితుడై భాజపాలో చేరినట్లు ముబషిర్‌ తెలిపారు. పార్టీ మారడం గురించి తన మామయ్య ఆజాద్‌తో చర్చించలేదన్నారు. ముబషిర్‌, ఆయన అనుచరులను జమ్మూ కశ్మీర్‌ భాజపా పార్టీ అధ్యక్షుడు రవీందర్‌ రైనా పార్టీలోకి ఆహ్వానించారు. ముబషిర్‌ పార్టీలో చేరడం ద్వారా దోడా, కిష్త్‌వార్‌, రంబాన్‌ జిల్లాలోని మరింత మంది యువత భాజపాలో  చేరేందుకు ఆసక్తి కనబరుస్తారని రవీందర్‌ అన్నారు. ప్రతిపక్ష పార్టీలతోపాటు అన్ని వర్గాల నాయకులు,  సామాజిక కార్యకర్తలు భాజపాలో చేరుతున్నారని, వీరితో జమ్మూ కశ్మీర్‌లో పార్టీ మరింత బలపడుతుందనే ఆశాభావాన్ని రవీందర్ వ్యక్తం చేశారు.

‘‘క్షేత్రస్థాయిలో మోదీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రామాలు చేపడుతుంటే, కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత పోరులో కూరుకుపోయింది. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేతల్లో ఒకరైన గులాం నబీ ఆజాద్‌ పట్ల ఆ పార్టీ వ్యవహరించిన తీరు ప్రజల మనోభావాలను దెబ్బతీసింది’’ అని ముబషిర్ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆజాద్‌ సేవలను ప్రశసించారని గుర్తుచేశారు. గతేడాది కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం, సంస్థాగత నిర్మాణంలో మార్పు అవసరమంటూ ఎత్తిచూపిన 23 మంది (జి-23) నేతల్లో ఆజాద్‌ కూడా ఉన్నారు. ఈ పరిణామాల తర్వాత ఆజాద్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించడం, ఆజాద్‌కు కేంద్రం పద్మభూషణ్‌ అవార్డు ప్రకటించడం కాంగ్రెస్‌కు మింగుడుపడని చర్యలుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని