Covid Toolkit: ఇద్దరు కాంగ్రెస్‌ నేతలకు నోటీసులు

కొవిడ్‌ టూల్‌కిట్‌ వ్యవహారంలో సామాజిక మాధ్యమం ట్విటర్‌కు శనివారం నోటీసులు పంపిన దిల్లీ పోలీసులు తాజాగా ఇద్దరు కాంగ్రెస్‌ నేతలకు సైతం నోటీసులు జారీ చేశారు. భాజపా అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర నకిలీ ‘కొవిడ్‌ టూల్‌కిట్’ను షేర్‌ చేశారంటూ కాంగ్రెస్‌ నేతలు రాజీవ్‌ గౌడ, రోహన్‌ గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Published : 26 May 2021 01:08 IST

దిల్లీ: కొవిడ్‌ టూల్‌కిట్‌ వ్యవహారంలో సామాజిక మాధ్యమం ట్విటర్‌కు శనివారం నోటీసులు పంపిన దిల్లీ పోలీసులు తాజాగా ఇద్దరు కాంగ్రెస్‌ నేతలకు సైతం నోటీసులు జారీ చేశారు. భాజపా అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర నకిలీ ‘కొవిడ్‌ టూల్‌కిట్’ను షేర్‌ చేశారంటూ కాంగ్రెస్‌ నేతలు రాజీవ్‌ గౌడ, రోహన్‌ గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దర్యాప్తునకు సహకరించాలని, స్టేట్‌మెంట్‌ రికార్డు చేసేందుకోసం రావాలని దిల్లీ పోలీసులు వారిరువురికి నోటీసులు పంపారు. కాగా దిల్లీ పోలీసుల విచారణకు తాము హాజరుకాబోమని.. తాము ఛత్తీస్‌గఢ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఈ వ్యవహారాన్ని అక్కడే తేల్చుకుంటామని రాజీవ్‌ గౌడ వెల్లడించారు.

భాజపా అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర ఇటీవల ‘కొవిడ్‌ టూల్‌కిట్‌’ అంటూ ఓ ట్వీట్‌ చేశారు. అయితే ఆ ట్వీట్‌ను ‘వక్రీకరణ’గా ట్విటర్‌ ఇటీవల వర్గీకరించింది. ఈ వ్యవహారంలోనే ట్విటర్‌ ఇండియాకు దిల్లీ పోలీసులు సోమవారం నోటీసులు పంపారు. ఈ అంశంపై సమాచారం అందజేయాలని స్పష్టం చేశారు. అయితే ట్విటర్ ఇండియా ఎండీ ఇచ్చిన సమాధానాలు గందరగోళంగా ఉండటంతో దిల్లీ పోలీసులు సోమవారం దిల్లీ, గురుగ్రామ్‌లోని ట్విటర్‌ కార్యాలయాలకు వెళ్లి దర్యాప్తు జరిపారు. ఈ కొవిడ్‌ టూల్‌కిట్ వ్యవహారంపై భాజపా, కాంగ్రెస్‌ పరస్పరం ఘాటుగా విమర్శించుకుంటున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని