Dhulipalla Narendra: జగన్‌ రూపాయి ఇచ్చి రూ.10 దోచుకుంటారు: ధూళిపాళ్ల

తనను విమర్శించడం వైకాపా నేతలకు అలవాటైందని తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Updated : 09 Mar 2024 15:21 IST

పొన్నూరు: తనను విమర్శించడం వైకాపా నేతలకు అలవాటైందని తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు రెవెన్యూ లోటు ఉందని.. అయినా ప్రజలపై పైసా భారం లేకుండా చంద్రబాబు పాలించారని చెప్పారు. వైకాపా ప్రభుత్వం స్మార్ట్‌ మీటర్ల పేరుతో రూ.వేల కోట్లు దోచుకుందని ఆరోపించారు. ప్రజలకు జగన్‌ రూపాయి ఇచ్చి రూ.10 దోచుకుంటున్నారని మండిపడ్డారు. వైకాపా హయాంలో 7 సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెరిగాయన్నారు.

‘పీపీఏల రద్దు పేరుతో పెట్టుబడి పెట్టిన వారిని ఈ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసింది. జగన్ అధికారంలోకి వచ్చాక పొన్నూరు నియోజకవర్గంలో అదనంగా విద్యుత్ ఛార్జీల రూపంలో ప్రజలపై రూ.32.09 కోట్ల భారం వేశారు. జగన్ అధికారం చేపట్టాక పన్నులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ ప్రభుత్వం వివిధ పన్నుల రూపంలో ప్రజల మీద రూ.50 వేల కోట్ల భారం మోపింది. విద్యుత్ బిల్లుల పేరుతో పలువురికి సంక్షేమ పథకాల్లో కోత పెట్టారు. పొన్నూరు నియోజకవర్గంలోనే 300 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగించారని సుమారు 7వేల పింఛన్లు తొలగించారు. ప్రజలను ఓటు అడిగే నైతిక అర్హత ఈ ప్రభుత్వానికి లేదు’ అని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు