Dr RS Praveen Kumar: బీఎస్పీకి ప్రవీణ్‌ కుమార్‌ రాజీనామా

బీఎస్పీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా వెల్లడించారు.

Updated : 16 Mar 2024 18:32 IST

హైదరాబాద్‌: బహుజన్‌ సమాజ్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆ పార్టీని వీడారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. కొత్త మార్గంలో ప్రయాణించాల్సిన సమయం వచ్చిందని, పార్టీని వీడటం తప్ప మరో అవకాశం లేకుండాపోయిందని పేర్కొన్నారు.

‘‘పొత్తు (భారాస-బీఎస్పీ) ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా ముందుకు సాగాల్సిందే. ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం. మా పొత్తు గురించి వార్త బయటకు వచ్చిన వెంటనే భాజపా దాన్ని భగ్నం చేయాలని విశ్వప్రయత్నాలు (కవిత అరెస్టుతో సహా) చేస్తోంది. ఈ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. నా ప్రస్థానాన్ని ఆపలేను. చివరి వరకు బహుజనవాదాన్ని నా గుండెల్లో పదిలంగా దాచుకుంటా’’ అని ప్రవీణ్‌ కుమార్‌ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. తెలంగాణలో భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఇక బీఎస్పీదే అన్నారు.

కేసీఆర్‌తో ప్రవీణ్‌ కుమార్‌ భేటీ..

బీఎస్పీకి రాజీనామా చేసిన తరువాత ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌.. భారాస అధినేత కేసీఆర్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారాస, బీఎస్పీ పొత్తు లేకుండా భాజపా ఒత్తిడి తీసుకొచ్చిందని, ఒప్పందాన్ని ఉల్లంఘించరాదన్నదే తన అభిమతమని తెలిపారు. ‘‘రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు లౌకిక కూటమి ఏర్పాటు చేస్తే నాపై ఒత్తిడి తీసుకొచ్చారు. భారాసతో పొత్తు లేదని మీడియా సమావేశం పెట్టాలని ఆదేశించారు. అందుకే బాధాతప్త హృదయంతో బీఎస్పీనీ వీడా. తెలంగాణలో ఉండే బహుజన ప్రయోజనాల కోసమే నా నిర్ణయం. నేను ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గను. అందరితో చర్చించాకే రాజకీయ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకుంటా. భవిష్యత్‌లో కేసీఆర్‌, భారాసతో కలిసి నడుస్తా’’ అని ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని