Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికలకు మోగిన నగారా.. 56 స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్‌

Rajya Sabha Elections: రాజ్యసభలో త్వరలో ఖాళీ కానున్న 56 స్థానాలకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 27న పోలింగ్‌ జరగనుంది.

Updated : 29 Jan 2024 14:36 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Polls) సమీపిస్తున్న వేళ దేశంలో మరో ఎన్నికల సమరానికి నగారా మోగింది. రాజ్యసభలో (Rajya Sabha Elections) ఏప్రిల్‌లో ఖాళీ అయ్యే 56 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఇందులో ఏపీ నుంచి 3, తెలంగాణ నుంచి మూడు స్థానాలున్నాయి. ఫిబ్రవరి 8న ఈసీ (Election Commission) నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. వచ్చే నెల 27న పోలింగ్ నిర్వహించనుంది.

ఎన్నికల తేదీలివే..

  • నోటిఫికేషన్‌ జారీ: ఫిబ్రవరి 8
  • నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ: ఫిబ్రవరి 15
  • పరిశీలన : ఫిబ్రవరి 16
  • ఉపసంహరణకు చివరి తేదీ: ఫిబ్రవరి 20
  • పోలింగ్‌ తేదీ : ఫిబ్రవరి 27

ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఓటింగ్‌ పూర్తయిన తర్వాత అదే రోజు (ఫిబ్రవరి 27) సాయంత్రం 5గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.

దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 56 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్‌లో ముగియనుంది.  వీరిలో తెలంగాణ నుంచి వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్‌, జోగినపల్లి సంతోష్‌;  ఏపీ నుంచి సీఎం రమేశ్‌, కనకమేడల రవీంద్రకుమార్‌, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి ఉన్నారు. దీంతో ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 10 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. బిహార్‌లో 6, మహారాష్ట్రలో 6, పశ్చిమబెంగాల్‌లో 5, మధ్యప్రదేశ్‌ 5, గుజరాత్‌ 4, కర్ణాటకలో 4, ఒడిశా, రాజస్థాన్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మూడేసి చొప్పున స్థానాలకు; హరియాణా, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో ఒక్కో రాజ్యసభ స్థానానికి పోలింగ్‌ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని