
దిల్లీ ఫైట్: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
దిల్లీ: దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.5,000-7,500 వరకు అందిస్తామని.. విద్యుత్, నీటి వినియోగదారులకు క్యాష్‌బ్యాక్ స్కీమ్స్ అమలు చేస్తామని ప్రకటించింది. దిల్లీ కాంగ్రెస్ చీఫ్ సుభాష్ చోప్రా, పార్టీ నేతలు ఆనంద్ శర్మ, అజయ్ మాకెన్ ఆదివారమిక్కడ మేనిఫెస్టోను విడుదల చేశారు.
తాము అధికారంలోకి వస్తే నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొంది. వాయు కాలుష్యం నివారణ, రవాణా సదుపాయాల అభివృద్ధికి బడ్జెట్‌లో 25 శాతం కేటాయిస్తామని హామీ ఇచ్చింది. ‘యువ స్వాభిమాన్ యోజన’ కింద డిగ్రీ పూర్తి చేసిన వారికి రూ.5వేలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి రూ.7,500 చొప్పున అందజేస్తామని తెలిపింది. రూ.15కే భోజనం అందించే 100 ఇందిరా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామంది. తాము అధికారంలోకి వస్తే సీఏఏపై సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామని, ఎన్‌ఆర్‌సీ అమలు చేయబోమని, ఎన్‌పీఆర్‌ను ప్రస్తుత రూపంలో తీసుకురాబోమని సుభాష్ చోప్రా వెల్లడించారు.