కమల్‌నాథ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం 

మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కమల్‌నాథ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో మంత్రిమండలిని విస్తరించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని.....

Published : 08 Mar 2020 16:50 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కమల్‌నాథ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో మంత్రిమండలిని విస్తరించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్‌ నేత ఒకరు ఆదివారం తెలిపారు. కమల్‌నాథ్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇటీవల ఎమ్మెల్యేలను అపహరించారని భాజపాపై కాంగ్రెస్‌ ఆరోపణలు గుప్పించగా.. ఆ ఆరోపణలను ఆ పార్టీ ఖండించిన సంగతి తెలిసిందే. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ నేతల్లో అంతర్గత పోరే ఇందుకు కారణమని విమర్శించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ‘‘భాజపాకు పన్నిన కుట్ర భగ్నమైంది. త్వరలో కేబినెట్‌ను విస్తరించనున్నాం’’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తెలిపారు.

మొత్తం 230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 114 స్థానాలు మాత్రమే గెలిచింది. దీంతో ఇద్దరు బీఎస్పీ, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే సహా నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో సహకారంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వం కొలువుదీరింది. ప్రస్తుతం సీఎం కమల్‌నాథ్‌తో కలిపి 29 మంది మంత్రులు ఉన్నారు. మరో ఆరుగురికి కేబినెట్‌లోకి చోటుంది. తాజా పరిణామాల నేపథ్యంలో అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ దశలో కేబినెట్‌ విస్తరణ కమల్‌నాథ్‌కు కత్తిమీద సామేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సొంత పార్టీ ఎమ్మెల్యేలతో పాటు భాగస్వామ్య పక్ష పార్టీ ఎమ్మెల్యేలను సంతృప్తి పరచడం అంత సులువు కాదని అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని