పది పరీక్షలు రద్దు చేయాలి: పవన్‌ కల్యాణ్‌

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. చిన్నారుల ఆరోగ్యాన్ని ఆపదలోకి నెట్టి వారి ప్రాణాలతో చెలగాటం ఆడడం ఎంతమాత్రం మంచిది కాదని హితవు

Published : 15 Jun 2020 17:31 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. చిన్నారుల ఆరోగ్యాన్ని ఆపదలోకి నెట్టి వారి ప్రాణాలతో చెలగాటం ఆడడం ఎంతమాత్రం మంచిది కాదని హితవు పలికారు. పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఎక్కడా పరీక్షలు నిర్వహిస్తున్న దాఖలాలు లేవని అన్నారు. డిగ్రీ, పీజీతో పాటు వృత్తి, ప్రవేశ పరీక్షలు సైతం రద్దైపోయాయని గుర్తు చేశారు. ఈ క్రమంలో జులై 10 నుంచి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోందని అన్నారు. పేపర్లు కుదించినప్పటికీ కరోనా విజృంభణ వేళ పరీక్షలు నిర్వహించడం శ్రేయస్కరం కాదని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఆరు వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, ఈ సమయంలో విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లడం ప్రమాదకరమని పవన్‌ అన్నారు. ప్రజా రవాణా పూర్తి స్థాయిలో లేదని, ప్రైవేటు వాహనాల అందుబాటు కూడా పరిమితంగానే ఉందని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రుల కోరిక మేరకు చిన్నారుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని పదోతరగతి పరీక్షలను రద్దు చేయాలన్నారు. పొరుగు రాష్ట్రాలు అనుసరించిన విధానాలను పాటించాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యావంతులు, వైద్యనిపుణులతో పలు దఫాలుగా చర్చించాకే ఈ డిమాండ్‌ను ప్రభుత్వం ముందు ఉంచుతున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని