UP Politics: తెరపైకి పరశు‘రామ’ మంత్రం!

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని

Updated : 10 Jan 2022 10:29 IST

బ్రాహ్మణ ఓటర్లకు కమలనాథుల వల

ఈనాడు, లఖ్‌నవూ: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలకు పురాణ పురుషుడైన పరశురాముడు సహాయం అవసరమైంది. శ్రీరాముడిని నిత్యం స్మరించే భాజపా వ్యూహాత్మకంగా పరశురాముడిని తెరపైకి తీసుకొచ్చింది. తొలుత ఈ ఎత్తుగడను సమాజ్‌వాదీ పార్టీ వేసింది. ఆ పార్టీ గతంలోనే గోసాయిగంజ్‌లోని పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ రహదారి పక్కన పరశురాముని ఆలయం నిర్మించింది. దీంతో పలువురు సీనియర్‌ బ్రాహ్మణనేతలు ఎస్పీ వైపు మొగ్గుచూపడం లేదా ఆ పార్టీలోకి వలస వెళ్లడాన్ని భాజపా నాయకత్వం గ్రహించింది. ఆ తర్వాత కొంతకాలానికి ఇదే అంశంపై దిల్లీలో పార్టీకి చెందిన బ్రాహ్మణ నేతలు, కొందరు మంత్రులతో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా కమలంపై బ్రాహ్మణుల అసంతృప్తి, ఆగ్రహం వంటి అంశాలు చర్చకు వచ్చాయి. నష్టనివారణ కోసం సత్వరమే ఏమైనా చేయాలన్న నిర్ణయంలో భాగంగా లఖ్‌నవూలోని కృష్ణానగర్‌లో 11 అడుగుల ఎత్తైన పరశు రాముడి విగ్రహాన్ని భాజపా బ్రాహ్మణనేత, ఉప ముఖ్యమంత్రి దినేశ్‌శర్మ ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కేబినెట్‌ మంత్రి బ్రిజేష్‌పాఠక్, ఎంపీ రీటా బహుగుణ జోషి పాల్గొన్నారు.

* రాష్ట్రంలో బీసీ, దళిత, ముస్లిం వర్గాల తరువాత చాలా రాజకీయ పార్టీల దృష్టి బ్రాహ్మణ ఓటర్లపైనే ఉంది. యూపీలో వారి జనాభా 12శాతం కంటే ఎక్కువ. అయితే, బ్రాహ్మణ ఓటర్లు 15శాతానికి పైగా ఉన్న నియోజకవర్గాలు రాష్ట్రంలో చాలా కనిపిస్తాయి. భాజపా పరశురాముని విగ్రహస్థాపనపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. యోగి పాలనపై ఆగ్రహంతో ఉన్న బ్రాహ్మణులను బుజ్జగించి ఆకట్టుకునేందుకు భాజపా ఈ నాటకం ఆడుతోందని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని