Andhra News: ‘సినిమావాళ్లను నమ్ముకుని రాజకీయం చేయటం కాపులకు అసాధ్యం’

‘సినిమావాళ్లనో, ఓ పరిశ్రమనో నమ్ముకుని రాజకీయం చేయటం కాపులకు అసాధ్యం. కులంలో నుంచి సమష్టి నాయకత్వం వచ్చినప్పుడే ఈ సామాజికవర్గం ముందుకెళ్తుంది’ అని తమిళనాడు రాష్ట్రప్రభుత్వ మాజీ ప్రధానకార్యదర్శి పాపిశెట్టి రామ్మోహన్‌రావు అన్నారు.

Updated : 25 Dec 2022 08:32 IST

తమిళనాడు మాజీ సీఎస్‌ రామ్మోహన్‌రావు

ఈనాడు, అమరావతి: ‘సినిమావాళ్లనో, ఓ పరిశ్రమనో నమ్ముకుని రాజకీయం చేయటం కాపులకు అసాధ్యం. కులంలో నుంచి సమష్టి నాయకత్వం వచ్చినప్పుడే ఈ సామాజికవర్గం ముందుకెళ్తుంది’ అని తమిళనాడు రాష్ట్రప్రభుత్వ మాజీ ప్రధానకార్యదర్శి పాపిశెట్టి రామ్మోహన్‌రావు అన్నారు. కాపులు బీసీ రిజర్వేషన్‌ కోసం పోరాడొద్దని సూచించారు. గతంలో ముద్రగడ పద్మనాభానికీ ఈ విషయం తాను చెప్పానన్నారు. ఈ పోరాటం వల్ల బీసీలకు దూరమయ్యామని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏ రాజకీయ పార్టీ, ఏ ప్రభుత్వమూ కాపులకు బీసీ రిజర్వేషన్‌ ఇవ్వదని, అలా ఇస్తామని హామీ ఇచ్చినా అది ఒట్టిమాటేనని తెలిపారు. కాపులకు రిజర్వేషన్‌ ఇచ్చినా దానివల్ల ప్రయోజనం ఉండదన్నారు. ‘రాష్ట్రంలో కొన్నివర్గాలు 75 ఏళ్లుగా 20% రిజర్వేషన్లు పొందుతున్నాయి. వాటివల్లే అభివృద్ధి ఉంటే.. వారు ఈపాటికే ముఖ్యమంత్రులు అవ్వాలి కదా! ఎందుకు కాలేదు’ అని ప్రశ్నించారు. బీసీలు, ఇతర కులాలను కలుపుకొని వెళ్తేనే రాజ్యాధికారం సాధ్యపడుతుందని చెప్పారు. రాయల్‌ ఆంధ్రప్రదేశ్‌ కాపు ఉద్యోగుల సంక్షేమసంఘం వార్షిక క్యాలెండర్‌, డైరీ-2023 ఆవిష్కరణ కార్యక్రమం శనివారం మంగళగిరిలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రామ్మోహన్‌రావు మాట్లాడారు. 4-5% జనాభా ఉన్న కులాలు రాజ్యమేలుతున్నాయనే తప్పుడు ఆలోచనల్లోకి కాపులు మళ్లిపోయారని, అది సరికాదని అన్నారు. తుని ఘటన వల్ల కాపు యువతపై అల్లరిమూకలనే ముద్ర పడిపోయిందన్నారు. కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త తులసీ రామచంద్రప్రభు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని