ఇది రాష్ట్ర చరిత్రలో గుర్తుండిపోయే రోజు

ఆంధ్రప్రదేశ్‌, యువత భవిష్యత్తు కోసమే నారా లోకేశ్‌ యువగళం పేరుతో తొలి అడుగు వేశారని, రాష్ట్ర చరిత్రలో ఇది గుర్తుండిపోయే రోజని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

Published : 28 Jan 2023 04:50 IST

యువగళం సభలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్నెన్నాయుడు

ఈనాడు, తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌, యువత భవిష్యత్తు కోసమే నారా లోకేశ్‌ యువగళం పేరుతో తొలి అడుగు వేశారని, రాష్ట్ర చరిత్రలో ఇది గుర్తుండిపోయే రోజని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం కుప్పంలో నిర్వహించిన యువగళం బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ... 

‘రాష్ట్ర ప్రజలు అన్యాయానికి, అక్రమాలకు గురవుతుంటే చూసి తట్టుకోలేకనే ఆయన సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు కొంత మెత్తగా ఉంటారు లోకేశ్‌ మాత్రం అలా కాదు. అవినీతిపరుల తాట తీస్తారు. మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా లేరు. జగన్‌పై అలుపెరగకుండా మనం చేస్తున్న పోరాటం అంతిమ దశకు చేరుకుంది. రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో తెదేపా 160 స్థానాల్లో విజయం సాధిస్తుంది’ అని ధీమా వ్యక్తంచేశారు.


ప్రజల సమస్యలు తెలుసుకుంటాం

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకే లోకేశ్‌ పాదయాత్ర చేస్తున్నారు. నాడు ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినప్పుడు రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉండేది. అప్పుడు ఆయన యాత్ర నిర్వహించి అధికారంలోకి వచ్చారు. అదే బాటలో చంద్రబాబు పాదయాత్ర చేసి... ప్రజా సమస్యలు తెలుసుకొని ముఖ్యమంత్రి అయ్యారు. నేడు అంతకంటే దారుణ పరిస్థితులు ఉన్నాయి.

చినరాజప్ప, మాజీ మంత్రి


నవశకం ప్రారంభం

యువగళం పాదయాత్ర ద్వారా కుప్పంలో నవశకం ప్రారంభమైంది. నాలుగేళ్లుగా వైకాపా పాలనలో అరాచకాలు జరుగుతున్నాయి. చంద్రబాబు వస్తేనే వీటికి అడ్డుకట్ట పడతాయి. యువగళం ద్వారా వైకాపాను ఇంటికి పంపిస్తాం.

అమరనాథ్‌రెడ్డి, మాజీ మంత్రి


జగన్‌వి ఫ్యాక్షన్‌ రాజకీయాలు

జగన్‌వన్నీ ఫ్యాక్షన్‌ రాజకీయాలు. లోకేశ్‌ చరిత్ర ఎంతో ఉన్నతమైంది. ఆయన చిన్నప్పుడే తాత ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన తండ్రి చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అటువంటి లోకేశ్‌తో జగన్‌కు పోలిక లేదు.

ప్రతిభా భారతి, మాజీ స్పీకర్‌


వారిది గడప గడపకు వెళ్లలేని పరిస్థితి

రాష్ట్రాన్ని కాపాడుకునే ప్రయత్నంలోనే లోకేశ్‌ పాదయాత్ర చేస్తున్నారు. తాము గడప గడపకు వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయని స్వయంగా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలే అంటున్నారు. వైకాపాను రాష్ట్రం నుంచి తరిమివేయాలి. అప్పుల పాలన చేస్తున్న జగన్‌ను గద్దె దించాలి.

నిమ్మల కిష్టప్ప, మాజీ ఎంపీ


కొత్త ఉద్యోగాలు లేవు... జీతాలూ ఇవ్వట్లేదు

జగన్‌ వచ్చాక నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఉన్న ఉద్యోగులకు జీతాలూ ఇవ్వట్లేదు. అమ్మఒడి వస్తుందన్న ఆనందం కంటే ఉద్యోగం రాక యువత మానసికంగా కుంగిపోతోందని మహిళలు ఆందోళన చెందుతున్నారు. జగన్‌ మోహన్‌రెడ్డి... అవినీతి కేసుల్లో 16 నెలలు జైల్లో ఉన్నారు. అధికారంలోకి వచ్చాక లోకేశ్‌పై 14 కేసులు పెట్టారు. యువగళంపై భయంతోనే 15 షరతులు విధించారు.

వంగలపూడి అనిత, తెలుగు మహిళ అధ్యక్షురాలు


పోలీసులు, రౌడీలు కలిసిపోయారు

పోలీసులు, రౌడీలు కలిసి దుర్మార్గాలు చేస్తున్నారు. రౌడీలను ఎదుర్కొనేందుకు గుండెలు అడ్డు పెట్టి లోకేశ్‌ వస్తున్నారు. ఈ పాదయాత్రతో వైకాపా ఇంటికి వెళ్లడం ఖాయం. సీˆఎం బయటకు రావాలంటే దుకాణాలు మూయాలి. పరదాలు కట్టాలి. ఆయనకు జనం మధ్యకు వచ్చే దమ్ము లేదు. ఎన్నికలు వస్తే ప్రస్తుత, మాజీ మంత్రుల్లో 32 మంది ఓడిపోతారు.

సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి


నిలబడతాం... కలబడతాం

లోకేశ్‌ పాదయాత్రతో తెదేపాలో స్వరం, తరం మారుతోంది. ఇది యువగళం తెస్తున్న మార్పు. పోరాటానికి రాష్ట్ర యువతరం సిద్ధపడింది. ప్రజల సంక్షేమం కోసం నిలబడతాం... అవసరమైతే కలబడతాం. వారికి భద్రత కల్పించేందుకు కృషి చేస్తాం. లోకేశ్‌... పాదయాత్ర సందర్భంగా ఇబ్బందులు పెడతారు ఓర్చుకో... మంచి మాటలు నేర్చుకో... రాళ్లు వేస్తారు వాటిని మెట్లుగా మార్చుకో.

పయ్యావుల కేశవ్‌, ఎమ్మెల్యే


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు