Kotamreddy: ట్యాపింగ్ నిజం.. ఇదిగో.. ఆధారాలతో సహా బయటపెడుతున్నా..
‘నాలుగు నెలలుగా నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది. ఆధారాలు లేకుండా మాట్లాడే వ్యక్తిని కాదు. పార్టీ నుంచి మౌనంగా వెళ్దామనుకున్నా. నన్ను దోషిగా నిలబెట్టాలని చూశారు.
జగనన్నా.. నీ ఫోన్ ట్యాప్ చేస్తే ఎలా ఉంటుంది?
నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యాఖ్యలు
ఈనాడు డిజిటల్, నెల్లూరు: నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: ‘నాలుగు నెలలుగా నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది. ఆధారాలు లేకుండా మాట్లాడే వ్యక్తిని కాదు. పార్టీ నుంచి మౌనంగా వెళ్దామనుకున్నా. నన్ను దోషిగా నిలబెట్టాలని చూశారు. అందుకే ట్యాపింగ్‌ను ఆధారాలతో బయటపెట్టా. ఐబీ చీఫ్ తనంతట తాను నాతో మాట్లాడారని అనుకోవట్లేదు. పార్టీ పెద్దలు చెబితేనే ఆయన నాతో మాట్లాడారని అనుకుంటున్నా. నేను ఇటీవల సీఎంను కలిసిన సమయానికి ట్యాపింగ్ ఆధారం నా వద్ద లేదు. అన్నా.. జగనన్నా.. నీ ఫోన్ ట్యాప్ చేస్తే ఎలా ఉంటుంది? సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, ధనుంజయ్‌రెడ్డి ఫోన్లు ట్యాప్ చేస్తే వారి స్పందన ఎలా ఉంటుంది? తప్పు చేసి ట్యాపింగ్ జరగలేదని అంటారా?’ అని నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఇలాంటి ప్రెస్‌మీట్ పెడతానని అనుకోలేదు. వైఎస్‌కు, జగన్‌కు ఎంత వీరవిధేయుడినో అందరికీ తెలుసు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఎంతో పోరాడాను. వైకాపా అధికారంలోకి వచ్చాక గుర్తింపు లేకపోయినా బాధపడలేదు. పార్టీ గురించి నేనెక్కడా పొరపాటుగా మాట్లాడలేదు. బారాషహీద్ దర్గాకు సీఎం జగన్ నిధులు మంజూరు చేసినా ఆర్థికశాఖ విడుదల చేయలేదు. దీనిపై ఆర్థికశాఖ కార్యదర్శి రావత్ తీరును విమర్శించాను. పార్టీకి వీరవిధేయుడైన నన్ను ఇబ్బంది పెట్టారు’ అని కోటంరెడ్డి తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించిన విషయాలివి..
వైకాపా నుంచి పోటీ చేయాలని లేదు..
‘ఇంటెలిజెన్స్ అధికారులు నాపై నిఘా పెట్టారు. అధికార పార్టీ నేతలపై నిఘా ఏమిటని బాధపడ్డా. నాలుగు నెలల క్రితమే ఓ ఐపీఎస్ అధికారి ట్యాపింగ్ గురించి చెప్పారు. అనుమానం ఉన్నచోట నేనుండలేను. వచ్చే ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేయాలని లేదు.. నన్ను సంజాయిషీ అడగకుండానే నాపై చర్యలు చేపట్టారు.
సీఎం మాటలుగానే భావిస్తున్నా..
నేను ఆధారాలు బయటపెడితే ఇద్దరు ఐపీఎస్‌లకు ఇబ్బంది అని భావించా. నిన్న బాలినేని శ్రీనివాసులరెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్పారు. పార్టీ నుంచి వెళ్లేవాళ్లు వెళ్లొచ్చని అన్నారు. ఆయన మాటలను సీఎం మాటలుగా భావిస్తున్నా. మంత్రులు, సీజే, జడ్జీలు, మీడియా ప్రతినిధుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారేమో. 35 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నట్లు నాతో చెప్పారు. ఈ విషయంలో అధికారులను తప్పుపట్టాల్సిన పని లేదు. ప్రభుత్వ పెద్దలు చెబితేనే ట్యాపింగ్ జరుగుతుంది. బాలినేని వద్దకు మా తమ్ముడు స్వయంగా వెళ్లలేదు. ఆయన పిలిస్తేనే వెళ్లారు..
తెదేపా నుంచి పోటీ చేయాలని ఉంది..
ట్యాపింగ్ గురించి నిర్ధారణ అయ్యాకే తన ప్లాన్ తాను చేసుకుంటున్నానని కోటంరెడ్డి తెలిపారు. కష్టపడి పని చేసిన తనకు.. పార్టీ గౌరవం ఇవ్వలేదన్నారు. ఐబీ చీఫ్ రాజకీయ నాయకుడి అవతారం ఎత్తుతారని తాను అనుకోలేదన్నారు. భవిష్యత్తు కార్యాచరణ ఏమిటని కార్యకర్తలు అడిగితే.. తెదేపా తరఫున పోటీ చేయాలని ఉన్నట్లుగా వారికి చెప్పానని తెలిపారు. ఈ విషయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబుదే నిర్ణయమని వ్యాఖ్యానించారు.
కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తా..
కొన్ని రోజుల కిందట నా బాల్య మిత్రుడితో ఐఫోనులో మాట్లాడా. ఆ విషయాల గురించి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు అడిగారు. ఆయన నాకు ఆడియో క్లిప్ పంపారు. ట్యాపింగ్ చేశారనడానికి ఇంతకుమించి ఆధారాలేం కావాలి? ట్యాపింగ్ కాకుండా ఆడియో క్లిప్ ఎలా బయటకు వచ్చింది? 9849996600 నంబరు నుంచి ఆడియో క్లిప్ వచ్చింది. ఏసీబీ చీఫ్‌గా ఉన్నప్పటి నుంచి సీతారామాంజనేయులు ఆ నంబరు వాడుతున్నారు. నేను ట్యాపింగ్ అంటున్నా.. కాదంటే మీరు నిరూపించండి. బాలినేని శ్రీనివాసులరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి దీనికి ఏం సమాధానం చెబుతారు? ట్యాపింగ్‌పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయబోతున్నా. ప్రభుత్వ పెద్దలే ఇలా చేస్తుంటే ఇంకెవరికి చెబుతాం?’ అని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు.
రుజువు లేదు..: ఎంపీ మిథున్‌రెడ్డి
ఈనాడు, దిల్లీ: ఫోన్ ట్యాపింగ్‌కు ఎటువంటి రుజువు లేదని వైకాపా లోక్‌సభ పక్ష నేత పి.వి.మిథున్‌రెడ్డి అన్నారు. దిల్లీలో బుధవారం ఆయన ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. ఇద్దరి మధ్య సంభాషణను ఒకరు రికార్డ్ చేస్తే ఫోన్ ట్యాపింగ్ అనలేరన్నారు. ఐ ఫోన్ సంభాషణను ట్యాప్ చేశారనే ప్రశ్నకు బదులిస్తూ.. మీది, నాది ఐ ఫోన్ అయినప్పుడు మీరు నాకు ఫోన్ చేస్తే.. నేను రికార్డ్ చేస్తే అది ఫోన్ ట్యాపింగ్ అవుతుందా అని ప్రశ్నించారు. ఎంపీల ఫోన్లు ట్యాపింగ్ కావడం లేదని మరో ప్రశ్నకు బదులిచ్చారు.
నిరూపించలేకపోతే పోటీ నుంచి తప్పుకొంటారా?
కోటంరెడ్డికి బాలినేని సవాల్
ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి విడుదల చేసింది ఆడియో కాల్ రికార్డని వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలులో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. శ్రీధర్‌రెడ్డి చెప్పినట్టు అది ఏమాత్రం ట్యాపింగ్ కాదని.. కేవలం కాల్ రికార్డేనని తాను నిరూపిస్తానని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొంటానని చెప్పారు. ఒకవేళ ట్యాపింగ్ అని నిరూపించలేకపోతే కోటంరెడ్డి తప్పుకొంటారా అని సవాల్ విసిరారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు బెదిరించారని చెప్పడం అవాస్తవమన్నారు. కోటంరెడ్డికి పార్టీలో ఉండటం ఇష్టం లేకపోతే వెళ్లిపోవచ్చని.. మంత్రి పదవి ఇవ్వలేదని ఇలా చేయడం సరికాదన్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి భద్రత తగ్గించారనడంలోనూ వాస్తవం లేదని చెప్పారు.
దేశంలో ట్యాపింగ్ ఎక్కడైనా నిరూపణ అయిందా?: కొడాలి నాని
‘ఫోన్ ట్యాప్ చేసినవారిని దేశంలో ఎవరినైనా.. ఏమైనా చేయగలిగారా? ఒక్కటైనా నిర్ధారణ అయిందా?’ అని గుడివాడ వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని ప్రశ్నించారు. ‘‘ఇంటలిజెన్స్ అధిపతి, ఎమ్మెల్యేలం ప్రభుత్వంలో భాగం. నాకొచ్చిన సమాచారాన్ని ఆయన (ఇంటెలిజెన్స్ చీఫ్)కు కొన్ని వందలసార్లు పంపా. మా గురించిన సమాచారం ఆయనకొస్తే మాకూ పంపుతుంటారు. అలాగే కోటంరెడ్డి బయట మాట్లాడింది ఆయన దృష్టికి వస్తే.. ‘ఇది జగన్ ప్రభుత్వం.. ఇలా మాట్లాడకండి.. ఇబ్బంది పడతారు’ అని పంపి ఉంటారు. అన్నీ ముఖ్యమంత్రే పిలిచి మాట్లాడతారా? రాష్ట్రంలో నాయకులందరి ఫోన్లను ట్యాప్ చేసి, ముఖ్యమంత్రి వింటూ కూర్చుంటారా?’’ అని ప్రశ్నించారు. కోటంరెడ్డి గురించి పరోక్షంగా మాట్లాడుతూ.. ‘చంద్రబాబు పనిచేయలేదనే కదా ఆయన్ను ప్రజలు ఓడించారు.. ఇప్పుడు ఆయన పార్టీలోకి చేరి నియోజకవర్గాలకు వీళ్లేం మంచి చేస్తారు? ఇలాంటివాళ్లు పోతేనే పార్టీకి దరిద్రం వదులుతుంది’ అని నాని వ్యాఖ్యానించారు.
ట్యాపింగ్ జరిగితే మాత్రం ఏమవుతుంది?
మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్య
‘మనకు తప్పుడు ఆలోచనలు లేవు, అక్రమాలు చేయడం లేదన్నపుడు ఒకవేళ ఫోన్ ట్యాపింగ్‌లాంటి వ్యవస్థ ఉండి, మన ఫోన్‌లను ట్యాప్ చేసినంత మాత్రాన ఏమవుతుంది?’ అని మాజీమంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ‘అసలు ట్యాపింగ్‌లు ఎందుకు జరుగుతాయి.. మోదీ కూడా ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తున్నారని చాలామంది రాజకీయ నాయకులు అన్నారు.. అందరికీ ఇదో ఊతపదంగా మారింది’ అని ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ‘ముఖ్యమంత్రి, ఆయన తండ్రి, తాత నుంచి అందరికీ సేవ చేశాను.. వారి భక్తుడిని అని చెప్పే వ్యక్తి, ఒకవేళ తన ఫోన్ ట్యాప్ అయితే మాత్రం ముఖ్యమంత్రిని విడిచి వెళ్లిపోతారా? ఇవన్నీ అవకాశవాదంతో చేస్తున్నవే’ అని కొట్టిపారేశారు. ‘ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్‌వేర్‌ను మేము అధికారంలో ఉన్నపుడు కొనలేదు అని చంద్రబాబే చెప్పారు. మేమూ కొనలేదు. అలాంటపుడు ట్యాపింగ్ చర్చ ఎందుకు వస్తుంది? ‘‘ముఖ్యమంత్రిపై ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి ఫోన్‌లో ఎబ్బెట్టుగా మాట్లాడిన ఆడియో ఇంటెలిజెన్స్ అధిపతి దృష్టికి వస్తే.. ముఖ్యమంత్రిపై మాట్లాడినట్లుంది కాబట్టే దాన్ని ఆయన చెక్ చేసుకోమని శ్రీధర్‌రెడ్డికి పంపి ఉండొచ్చు.. దాన్ని ఫోన్ ట్యాపింగ్ అంటే ఏమనాలి? ఆ అనుమానమే ఉంటే ముఖ్యమంత్రిని కలిసి చెప్పి ఉండొచ్చు కదా..’’ అని అన్నారు.
న్యాయమూర్తుల ఫోన్లూ ట్యాప్ చేశారు
జైభీమ్ పార్టీ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్
ఈనాడు డిజిటల్, ఒంగోలు: ‘ఫోన్లు ట్యాప్ చేయడం రాజ్యాంగానికి వ్యతిరేకం. దీనిపై సీబీఐ విచారణ చేపట్టాలి’ అని జైభీమ్ పార్టీ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఒంగోలులో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో విపక్ష నాయకులవే కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, సొంత పార్టీ నేతల ఫోన్లనూ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను సీఐడీ, ఇంటెలిజెన్స్ అధికారులు ట్యాప్ చేశారంటూ 2020లో మీడియాలో వచ్చిన కథనాలతో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైందని చెప్పారు. విచారణ సందర్భంగా ఇలాగైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం చేయాలని అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఫోన్లు ట్యాప్ చేయడం లేదని చెబుతున్న అధికార పార్టీ నాయకులు సొంత పార్టీ ఎమ్మెల్యేలు చూపుతున్న ఆధారాలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Covid Tests: శంషాబాద్ విమానాశ్రయంలో మళ్లీ కరోనా పరీక్షలు
-
Politics News
అన్న రాజమోహన్‌రెడ్డి ఎదుగుదలకు కృషిచేస్తే.. ప్రస్తుతం నాపై రాజకీయం చేస్తున్నారు!
-
Ap-top-news News
Toll Charges: టోల్ రుసుముల పెంపు అమలులోకి..
-
World News
మా అమ్మ కన్నీటితో డైరీ తడిసిపోయింది
-
Crime News
గుండెపోటుతో 13 ఏళ్ల బాలిక మృతి
-
Ap-top-news News
అభివృద్ధి లేదు.. ఆత్మహత్య చేసుకుంటా.. జంగారెడ్డిగూడెంలో ఓ కౌన్సిలర్ ఆవేదన