పాదయాత్రలో పాల్గొన్న వారిపై హత్యాయత్నం కేసులా?

యువగళం పాదయాత్రలో పాల్గొంటున్న తెదేపా వాలంటీర్లు, కార్యకర్తలపై దాడి చేయాల్సిందిగా పోలీసుల్ని పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి ప్రేరేపిస్తున్నారని ఆ పార్టీ నేతలు ధ్వజమెత్తారు.

Published : 05 Feb 2023 04:38 IST

మా పార్టీ కార్యకర్తలపై దాడికి డీఎస్పీ సుధాకర్‌రెడ్డి పోలీసుల్ని ప్రేరేపిస్తున్నారు
డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు తెదేపా నేతల యత్నం
అడ్డుకున్న పోలీసులు

ఈనాడు డిజిటల్‌-అమరావతి, తాడేపల్లి, న్యూస్‌టుడే: యువగళం పాదయాత్రలో పాల్గొంటున్న తెదేపా వాలంటీర్లు, కార్యకర్తలపై దాడి చేయాల్సిందిగా పోలీసుల్ని పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి ప్రేరేపిస్తున్నారని ఆ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. పాదయాత్రలో పాల్గొన్న వారిపై హత్యాయత్నం కేసులు ఎలా బనాయిస్తారని మండిపడ్డారు. పాదయాత్రను అడ్డుకోవడానికి అధికార పార్టీ నాయకులతో కలిసి పోలీసులు కుట్రలు పన్నుతున్నారన్నారు. గజేంద్ర అనే తెదేపా వాలంటీర్‌పై పలమనేరు ఇన్‌స్పెక్టర్‌ విచక్షణారహితంగా దాడి చేశారని, రక్తపు గాయాలతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. యువగళానికి అడ్డంకులు సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు ఆయన కార్యాలయానికి.. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం నుంచి నేతలు, కార్యకర్తలు శనివారం పాదయాత్రగా వెళ్లారు. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి మార్గమధ్యలోనే వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడే లేఖ ఇచ్చి వెళ్లాలని మంగళగిరి డీఎస్పీ రాంబాబు సూచించడంతో తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శని, ఆదివారాలు డీజీపీ కార్యాలయానికి సెలవని డీఎస్పీ రాంబాబు వారికి సర్దిచెప్పి ఫిర్యాదు లేఖను తీసుకోవడంతో ఆందోళనను విరమించారు. ‘‘ఫిబ్రవరి 2న యువగళం ప్రచారరథాన్ని స్వాధీనం చేసుకోవడానికి పోలీసులు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో శుక్రవారం లోకేశ్‌ పాదయాత్ర బంగారుపాళ్యం చేరుకోగానే గ్రామంలో విద్యుత్తు సరఫరా నిలిపేశారు. మూడు వాహనాలను సీజ్‌ చేశారు. పాదయాత్రలో పాల్గొన్న వాలంటీర్లు, తెదేపా కార్యకర్తలపై లాఠీఛార్జి చేశారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలి. సీజ్‌ చేసిన యువగళం వాహనాలను అప్పగించి, లోకేశ్‌ పాదయాత్రకు భద్రతా ఏర్పాట్లు చేసేలా స్థానిక పోలీసులను ఆదేశించాలి’’ అని తెదేపా నేతలు లేఖలో కోరారు.

వివేకా హత్య కేసును దారి మళ్లించడానినే ఆటంకాలు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే లోకేశ్‌ పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. ‘పాదయాత్ర చేసున్న లోకేశ్‌ మీద ఐపీసీ సెక్షన్లు 353, 290,188, 341 కింద కేసులు; తెదేపా కార్యకర్తల    మీద 307 తదితర సెక్షన్ల కింద కేసులు పెడతారా? చేతనైతే ఒకే నంబర్‌తో రెండు వాహనాలు నడుపుతున్న సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి కార్లు సీజ్‌ చేయాలి’’ అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డీజీపీకి సవాలు చేశారు. జగన్‌రెడ్డికి పాదసేవ చేయడానికి డీజీపీ కార్యాలయం పనికొస్తుందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. కార్యక్రమంలో తెదేపా నేతలు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, అశోక్‌బాబు, తెనాలి శ్రావణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

జగన్‌ కుట్రలో భాగంగానే లోకేశ్‌పై అక్రమ కేసులు: అచ్చెన్నాయుడు  

జగన్‌ కుట్రలో భాగంగానే తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ సహా ఆరుగురు నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వ అరాచక పాలన, ప్రజావ్యతిరేక విధానాలను యువగళం ద్వారా క్షేత్రస్థాయికి తీసుకెళుతుండటంతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు