గడీల పాలనే గుర్తుకొస్తోంది!

పదెకరాల్లో 150 గదులతో అలరారుతున్న ప్రగతిభవన్‌ను చూస్తే మళ్లీ గడీల పాలనే గుర్తుకొస్తోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.

Published : 08 Feb 2023 04:09 IST

హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలో రేవంత్‌ రెడ్డి

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, న్యూస్‌టుడే: పదెకరాల్లో 150 గదులతో అలరారుతున్న ప్రగతిభవన్‌ను చూస్తే మళ్లీ గడీల పాలనే గుర్తుకొస్తోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. దాంతో ప్రజలకు ఉపయోగమేంటని ప్రశ్నించారు. మంగళవారం ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలంలో రామప్ప ఆలయాన్ని సందర్శించిన అనంతరం రెండోరోజు హాథ్‌ సే హాథ్‌ జోడో పాదయాత్ర ప్రారంభమైంది. రాత్రి ములుగులో ఏర్పాటుచేసిన కూడలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘కేటీఆర్‌ రాష్ట్రంలోని ప్రజలందరూ మా కుటుంబ సభ్యులేనని వ్యాఖ్యానించారు.రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన అమరుల కుటుంబసభ్యులు వారిలో లేరా? ఏనాడైనా వారిని పిలిచి బువ్వ పెట్టారా? త్యాగానికి సిద్ధమై సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే కేసీˆఆర్‌ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు. ఆయన రూ.లక్షల దోపిడీకి పాల్పడ్డారు. తొమ్మిదేళ్ల కాలంలో 10వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని లెక్కలు చెబుతున్నాయి. వారి మరణాలకు కేసీఆరే కారణం. ఇక్కడ అన్యాయం చేసింది చాలక దేశాన్ని ఉద్ధరిస్తామని బయలుదేరారు. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం గిరిజనులు, ఆదివాసీలకు 10 లక్షల ఎకరాలు పంపిణీ చేస్తే..భారాస ప్రభుత్వం హరితహారం పేరుతో గిరిజనుల భూములను లాక్కుంటోంది. 2024 జనవరి 1 నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుంది. పోడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చే బాధ్యతను తీసుకుంటాం.ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మ పేరు పెడతాం. ములుగులో గిరిజన యూనివర్సిటీ, మల్లంపల్లి మండలం ఏర్పాటుచేస్తాం.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు కృతజ్ఞత తెలుపుదాం’’ అని రేవంత్‌ అన్నారు. కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌, మాజీ ఎంపీలు సిరిసిల్ల రాజయ్య, మల్లు రవి, నాయకులు బెల్లయ్యనాయక్‌, వేం నరేందర్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని