ప్రజలకు కాంగ్రెస్‌ టోపీ

ఎన్నికల సందర్భంగా ‘గ్యారంటీ’ పేరిట హామీలను ప్రకటించే కాంగ్రెస్‌.. ఆ తర్వాత అవన్నీ మరిచిపోతుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు.

Published : 26 Mar 2023 04:39 IST

కర్ణాటక పర్యటనలో ప్రధాని మోదీ ధ్వజం

ఈనాడు, బెంగళూరు: ఎన్నికల సందర్భంగా ‘గ్యారంటీ’ పేరిట హామీలను ప్రకటించే కాంగ్రెస్‌.. ఆ తర్వాత అవన్నీ మరిచిపోతుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. శనివారం ఆయన కర్ణాటకలోని బెంగళూరు, చిక్కబళ్లాపుర, దావణగెరెలలో పర్యటించారు. ఈ సందర్భంగా దావణగెరెలో నిర్వహించిన ‘మహాసంగమ’ సభలో మాట్లాడారు. ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల సందర్భంగా గ్యారంటీ పథకాలు ప్రకటించి ప్రజలను మభ్యపెట్టారని ప్రధాని ఆరోపించారు. ఫలితాలు వెల్లడై అధికారం చేపట్టి 3నెలలు దాటినా ఇచ్చిన హామీలపై కాంగ్రెస్‌ నోరు మెదపటం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం కర్ణాటకలోనూ ఇదే తరహా హామీలతో ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తోందని వివరించారు. ఆర్థికంగా దూసుకెళుతున్న కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలిస్తే ఏటీఎంగా మార్చుకుంటుందని విమర్శించారు. విజయానికి ఆరాటపడుతున్న కాంగ్రెస్‌ తనకు సమాధి కట్టాలని చూస్తోందని ధ్వజమెత్తారు. మోదీ కమలంలా వికసిస్తాడని అన్నారు. రానున్న కర్ణాటక ఎన్నికల్లో భాజపాకు సంపూర్ణ ఆధిక్యాన్ని ఇవ్వాలని కోరారు. దావణగెరె హెలిప్యాడ్‌ నుంచి సభాస్థలికి ప్రధాని వచ్చే సమయంలో ఓ వ్యక్తి ఆ మార్గంలోకి వచ్చే ప్రయత్నం చేశాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసంకల్పితంగానే వ్యక్తి వచ్చారని, భద్రత లోపం కారణం కాదని పోలీసులు తెలిపారు.

సత్యసాయి సేవలు స్ఫూర్తిదాయకం

సత్యసాయిబాబా తన సేవలతో స్ఫూర్తి నింపారని ప్రధాని కొనియాడారు. చిక్కబళ్లాపుర సమీపంలోని సత్యసాయిగ్రామ్‌ శివారులో నిర్మించిన ఎస్‌ఎంఎస్‌ఐఎంఎస్‌ఆర్‌ ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. అంతకుముందు దృశ్యమాధ్యమం ద్వారా మాట్లాడుతూ ఆధ్యాత్మికం, ప్రజాసంక్షేమం, విద్య, వైద్య రంగాల్లో సత్యసాయి సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల, ప్రాంతీయ భాషలో వైద్య కోర్సులవంటి చర్యలతో దేశంలో ప్రజారోగ్యం మెరుగుపడిందని వివరించారు. ఈ పర్యటన సందర్భంగా బెంగళూరులో 13 కి.మీ.పొడవైన కే.ఆర్‌.పురం-వైట్‌ఫీల్డ్‌ మెట్రో మార్గాన్ని ప్రధాని ప్రారంభించారు. రైలులో ప్రయాణించి విద్యార్థులు, కార్మికులతో మాట్లాడారు. కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని