100 సీట్లు ఎలా రావో చూద్దాం
‘ఏప్రిల్ 27న పార్టీ 22వ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. అందులో అందరి అభిప్రాయాలను తీసుకుని వచ్చే ఎన్నికలకు మేనిఫెస్టో రూపొందిస్తాం.
కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుని మేనిఫెస్టో రూపొందిస్తాం
బండి సంజయ్, రేవంత్‌లు జీవితంలో ఏమైనా పరీక్షలు రాశారా?
సిరిసిల్ల పర్యటనలో మంత్రి కేటీఆర్
ఈనాడు డిజిటల్ - సిరిసిల్ల
‘ఏప్రిల్ 27న పార్టీ 22వ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. అందులో అందరి అభిప్రాయాలను తీసుకుని వచ్చే ఎన్నికలకు మేనిఫెస్టో రూపొందిస్తాం. దీని ప్రకారం ముందుకు సాగితే వంద సీట్లు ఎలా రావో చూద్దాం’ అని పార్టీ కార్యకర్తలతో మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయన పర్యటించారు. కలెక్టరేట్‌లో ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డులను అందజేశారు. ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో ముగ్గురు దళితబంధు లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న రైస్‌మిల్లును ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో జరిగిన భారాస ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... ‘ఆవిర్భావ దినోత్సవానికి ముందు ప్రతి పది ఊర్లను ఒక యూనిట్‌గా తీసుకుని 3-4 వేల మంది సమావేశం కావాలి. అందులో చర్చించి, అందరి అభిప్రాయాలను తీసుకోవాలి. వాటి నుంచే మేనిఫెస్టో రూపొందించుకుందాం.
త్వరలో రూ.1,300 కోట్ల బకాయిల విడుదల
గ్రామ పంచాయతీల్లో నిరుటి నవంబరు, డిసెంబరు వరకు రూ.కోటిలోపు బకాయిలున్న పల్లెప్రగతి, ఉపాధిహామీ, సీడీపీ గ్రాంట్లకు సంబంధించిన రూ.1,300 కోట్లు ఈ నెలాఖరులోగా విడుదలవుతాయి. తెలంగాణపై కేంద్రం పగ బట్టింది. ఉపాధి హామీ పథకంలో రాష్ట్రానికి రావాల్సిన రూ.1,200 కోట్లు నొక్కిపెడుతోంది. ఆదర్శ గ్రామాలంటే ఒకప్పుడు గంగదేవిపల్లి, అంకాపూర్‌ల గురించే మాట్లాడేవారు. ప్రస్తుతం తెలంగాణలోని 12,769 గ్రామ పంచాయతీలు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఉత్తమ పంచాయతీలు ఎక్కడున్నాయని అధికారులను అడిగితే కేరళలో ఉన్నాయని చెప్పేవారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాల వారు మన గ్రామాల్లో అధ్యయనం చేసేందుకు వస్తున్నారు.
మేమూ వారిలాగే మాట్లాడగలం
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ విషయంలో భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ సీఎంపై ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. మేం కూడా ప్రధాని మోదీని అలాగే అనలేమా? కానీ అనం. మాకు ఆ సంస్కారం ఉంది. భారాస ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు దొంగస్వాములను పంపించిన భాజపా సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి బి.ఎల్.సంతోష్‌నూ వారి భాషలోనే నిందించగలం. దేశంలో 125 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలున్నా పట్టించుకోకుండా అదానీ కోసమే ప్రధాని మోదీ ఆస్ట్రేలియాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. విద్యుత్తు డిమాండ్ గరిష్ఠంగా ఉండే సమయంలో 20% రుసుములు పెంచాలని కేంద్రం ప్రతిపాదించడం దారుణం.
బువ్వ పెడుతున్న తెలంగాణ
ఎల్లారెడ్డిపేట మండలం పదిరకు చెందిన దళితబంధు లబ్ధిదారులు విజయ్‌కుమార్, డప్పుల లింగయ్య, సూదమళ్ల రాజేశ్వరి... తమకొచ్చిన రూ.30 లక్షలకుతోడు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ రాయితీలు కలిపి రూ.3 కోట్లు జమ చేసి దుమాల గ్రామంలో రైస్‌మిల్లు నిర్మించుకున్నారు. దాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ మిల్లుకు శంకుస్థాపన చేసిన తనకే ప్రారంభించే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. ఇందులో పని చేసేందుకు 12 మంది బిహార్ నుంచి వచ్చారని, ఇతర రాష్ట్రాల వారికి తెలంగాణ బువ్వ పెడుతుందనడానికి ఇదే నిదర్శనమన్నారు.
ఏబీవీపీ నిరసన: గ్రూప్-1 పేపర్ లీకేజీని నిరసిస్తూ సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ని ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
నేను పేపర్ లీక్ చేస్తే...
నేను టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీక్ చేశానని బండి సంజయ్, రేవంత్‌రెడ్డి అంటున్నారు. వాళ్లు జీవితంలో ఏమైనా పరీక్షలు రాశారా? మల్యాల మండలంలో 417 మంది గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు హాజరైతే 35 మంది మాత్రమే మెయిన్స్‌కు అర్హత సాధించారు. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లు మాత్రం 100 మార్కులపైనే వచ్చాయంటున్నారు. వీరిలో జగిత్యాల జిల్లాలో 100 మార్కులు దాటిన వారు ఒక్కరే ఉన్నారు. నా పీఏ తిరుపతి సొంతూరు పోతారంలో పరీక్షకు హాజరైన ముగ్గురిలో ఒక్కరూ అర్హత సాధించలేదు. మల్యాలలో ముగ్గురు హాజరైనట్లు చెబుతున్నారు. కానీ, అక్కడ ఒక్కరే పరీక్ష రాశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4,200 మంది దరఖాస్తు చేసుకుని, 3,254 మంది హాజరవగా 255 మందికి 23-90 మధ్య మార్కులు మాత్రమే వచ్చాయి. నేను పేపర్ లీక్ చేస్తే సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల వారికి 100 మార్కులు ఎందుకు రాలేదు? అని ప్రశ్నించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Train Accident: కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం.. పలు రైళ్ల రద్దు, కొన్ని దారి మళ్లింపు
-
World News
Restaurant: ఎక్కువ ఆహారాన్ని ఆర్డర్ చేస్తే ఇలా అవమానిస్తారా..!
-
India News
Train Accident: ‘కోరమాండల్’ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం.. ఉలిక్కి పడిన 4 రాష్ట్రాలు
-
World News
Ukraine: జెలెన్స్కీ ఇంటి ఎదుట ‘నాటు-నాటు’ పాటకు దుమ్ములేపిన ఉక్రెయిన్ సైనికులు
-
Movies News
Samantha: ప్రియాంక చోప్రా తల్లిగా సమంత.. సమాధానం వచ్చినా సందేహమే!
-
India News
1945 నుంచి.. ఆ చర్చిలో 927 మందిపై లైంగిక వేధింపులు!