రైతు ఉద్యమంలో మీతో కలిసి పనిచేస్తాం

‘రైతు ఉద్యమంలో ఇంతవరకు కలిసి పనిచేస్తున్న మేమంతా మీతో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చాం.. అందుకు అవకాశం కల్పించండి’ అని భారాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మహారాష్ట్రకు చెందిన ప్రముఖ రైతు సంఘం షెట్కారీ సంఘటన్‌ నేతలు అభ్యర్థించారు.

Updated : 30 Mar 2023 05:54 IST

భేటీకి సమయమివ్వండి
సీఎం కేసీఆర్‌కు మహారాష్ట్ర రైతు సంఘం షెట్కారీ సంఘటన్‌ నేతల లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: ‘రైతు ఉద్యమంలో ఇంతవరకు కలిసి పనిచేస్తున్న మేమంతా మీతో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చాం.. అందుకు అవకాశం కల్పించండి’ అని భారాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మహారాష్ట్రకు చెందిన ప్రముఖ రైతు సంఘం షెట్కారీ సంఘటన్‌ నేతలు అభ్యర్థించారు. తమ సహోద్యోగులు, నాయకులు కలవడానికి కొంత సమయాన్ని కేటాయించాలని కేసీఆర్‌ను కోరారు. ‘నాందేడ్‌లో మీ బహిరంగ సభ అనంతరం రైతులకు మంచి జరగబోతోందనేది అర్థమైంది. ఇది ఎంతో ఊరటనిచ్చే అంశంగా మహారాష్ట్ర రైతులు భావిస్తున్నారు’ అని రైతు సంఘం నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు షెట్కారీ సంఘటన్‌ మహారాష్ట్ర అధ్యకుడు సుధీర్‌ సుధాకరరావు బిందు నేతృత్వంలో 52 మంది నేతలు బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు.

లేఖలోని ముఖ్యాంశాలు..

‘‘కొద్దిరోజుల కిందట మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని పలు గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్‌ చేశారు. ఒక రాష్ట్రానికి చెందినవారు మరో రాష్ట్రానికి ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు? అనే అంశాన్ని మేము చాలా ఆసక్తిగా పరిశీలించాం. ఇది తెలుసుకోవడానికి 40 గ్రామాల్లో పర్యటించాం. ప్రతి గ్రామంలో ప్రజలు తెలంగాణ ప్రభుత్వం తమ పౌరులు, రైతులు, దళితులు, మహిళలు, వికలాంగులు, వృద్ధులకు అందజేస్తున్న పథకాల గురించి చెప్పారు. ముఖ్యంగా రైతుబంధు గురించి అన్నిచోట్లా ప్రస్తావించారు. గత ఏడెనిమిదేళ్లలో తెలంగాణలోని తమ బంధువుల ఆర్థిక పరిస్థితుల్లో వచ్చిన మార్పు గురించి చాలామంది చెప్పారు. ఈ పథకాలను నిజంగానే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందా? అని తెలుసుకోవడానికి మేము తెలంగాణలోని అనేక గ్రామాల్లో పర్యటించాం. తెలంగాణ ప్రజలు మాకు ప్రతి పథకం గురించి వివరించారు. వీటన్నింటిలోనూ ప్రత్యేకత ఏమిటంటే.. ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవడానికి ఎవరికీ లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని అందరూ చెప్పారు. మా దృష్టిలో మీరు భారతీయ రైతులకు మార్షల్‌. దేశం నలుమూలల నుంచి రైతులు మీ పథకాల ప్రయోజనాలను పొందాలి. ముఖ్యంగా మహారాష్ట్రలో ప్రతిరోజూ ఏడుగురు రైతులు తమ జీవితాలను త్యాగం చేస్తున్నారు. మహారాష్ట్రలో మీ ఉనికి రైతులను ఉత్తేజపరుస్తుంది. రైతు ఉద్యమంలో పనిచేస్తున్న ఎందరో నాయకులు, శ్రామికుల్లో.. రైతు నాయకుడు శరద్‌జోషి నిష్క్రమించిన తర్వాత ఎవరితో కలిసి పనిచేయాలా? అనే ప్రశ్న తలెత్తింది. ఇటీవల మహారాష్ట్ర రైతు సంఘం నాయకులను మీతో కలిసి పనిచేయాలని మాణిక్‌రావు కదమ్‌ ఆహ్వానించారు. మీ ఇద్దరి సమావేశాల తర్వాత మహారాష్ట్రలో రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. రైతు ఉద్యమంలో మాతో కలిసి పనిచేస్తున్న మిత్రులందరూ మీతో చేతులు కలపాలని, మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నారు. రైతు ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి.. మీ విలువైన సమయంలో కొంత కేటాయించాలని కోరుకుంటున్నాం’’ అని రైతు సంఘం నేతలు కేసీఆర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.


భారాసలోకి ఎన్‌సీపీ యువనేత అభయ్‌ కైలాస్‌రావు

మహారాష్ట్రలో నిర్వహించిన భారాస బహిరంగ సభల అనంతరం ఆ రాష్ట్రానికి చెందిన పలువురు నేతల చేరికల పర్వం కొనసాగుతోంది. ఔరంగాబాద్‌, పర్భణీ జిల్లాల్లో పట్టున్న సీనియర్‌ రాజకీయ కుటుంబానికి చెందిన ఎన్‌సీపీ యువనేత అభయ్‌ కైలాస్‌రావు పాటిల్‌ చిక్టాగోవంకర్‌’ బుధవారం భారాస జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ సమక్షంలో పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో ఆయనకు కేసీఆర్‌ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అభయ్‌ తాత, తండ్రి, మామ ముగ్గురూ మాజీ ఎమ్మెల్యేలే. గతం(1998)లో ఔరంగాబాద్‌ ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా పనిచేసిన అభయ్‌ ఔరంగాబాద్‌ జడ్పీ(2002-07)కి ఎన్నికయ్యారు. జిల్లా ఎన్‌సీపీ యూత్‌ అధ్యక్షుడిగా, ఎన్‌సీపీ అధ్యక్షుడిగా, ఎన్‌సీపీ మహారాష్ట్ర స్టేట్‌ యూత్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.   చేరిక కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని