Rayapati: స్థానికులే అభ్యర్థులుగా ఉండాలి.. కడప, కర్నూలు నుంచి వస్తే కుదరదు: రాయపాటి

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తారని మాజీ ఎంపీ, తెదేపా నేత రాయపాటి సాంబశివరావు అన్నారు.

Updated : 21 Apr 2023 09:21 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తారని మాజీ ఎంపీ, తెదేపా నేత రాయపాటి సాంబశివరావు అన్నారు. పార్టీ కోసం, చంద్రబాబు మాట మీద ఆయనతో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించారు. చంద్రబాబు ఆదేశిస్తే నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడానికి తాను సిద్ధమని వెల్లడించారు. జగన్‌ వేధింపులతో ప్రజలు విసిగివేశారారని, గత ఎన్నికల్లో జగన్‌ వేవ్‌ను మించిన వేవ్‌తో 2024లో తెదేపా అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం వద్ద గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

‘‘నేను ఇప్పుడూ పోటీకి సిద్ధమే. నరసరావుపేటలో స్థానికులే అభ్యర్థిగా ఉండాలి. కడప నుంచో కర్నూలు నుంచో వస్తే కుదరదు. స్థానికులు ఎవరు పోటీ చేసినా నేను తప్పుకుంటాను. గుంటూరు జిల్లాలో అభ్యర్థులు లేకపోతే కదా వేరే ప్రాంతాల నుంచి తీసుకురావాల్సింది. మాచర్లలో బ్రహ్మారెడ్డి గెలుస్తారు. నా కుమారుడు రంగబాబుకు టికెట్‌ ఇవ్వమని కోరుతున్నా. సత్తెనపల్లి ఇస్తారా..? పెదకూరపాడు ఇస్తారా..? అనేది చంద్రబాబు ఇష్టం. వీలైతే మా తమ్ముడు కూతురు రాయపాటి శైలజకూ టికెట్‌ అడుగుతున్నా. చంద్రబాబు ఎక్కడ పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడ పోటీ చేయడానికి సిద్ధం. వాళ్లిద్దరికీ టికెట్‌ ఇస్తే.. నాకు టికెట్‌ లేకున్నా ఫర్వాలేదు’’ అని రాయపాటి సాంబశివరావు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని