ఎండైనా.. వానైనా.. అదే జోష్‌

మధ్యాహ్నం వరకు భానుడి భగభగలు.. సాయంత్రం భారీ ఈదురుగాలులు, జోరువానతో గంటపాటు ఆందోళనకర వాతావరణం.

Published : 29 May 2023 05:09 IST

ఉదయం మండుటెండ.. సాయంత్రం భారీ వర్షం
అయినా శ్రేణుల్లో తగ్గని ఉత్సాహం

ఈనాడు, రాజమహేంద్రవరం: మధ్యాహ్నం వరకు భానుడి భగభగలు.. సాయంత్రం భారీ ఈదురుగాలులు, జోరువానతో గంటపాటు ఆందోళనకర వాతావరణం. ఊహించని వాతావరణ మార్పులతో మహానాడుకు వచ్చిన తెదేపా కార్యకర్తల్లో కాసేపు గందరగోళం ఏర్పడింది. భారీ వర్షంలో ఏం చేయాలో తెలియక పలువురు తమ వాహనాల వద్దకు పరుగులు తీశారు. గంటలోనే సాధారణ పరిస్థితులు నెలకొనడంతో బయటకు వెళ్లినవారంతా సభా ప్రాంగణంలోకి వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.

భానుడి భగభగలు..

తెల్లవారుజామునుంచే పలు ప్రాంతాలవారు రైళ్లు, ప్రైవేటు బస్సులు, సొంత వాహనాల్లో తరలివచ్చారు. ఆదివారం రాజమహేంద్రవరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 39 డిగ్రీలుగా నమోదైంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన వారంతా స్థానిక నాయకులు, వాలంటీర్ల సూచన మేరకు శనివారం జరిగిన ప్రతినిధుల సభ ప్రాంగణంలో సేదదీరారు. అక్కడే భోజనం చేశారు.  సాయంత్రం 4.30కు వాతావరణం ఒక్కసారిగా మారింది. భారీ ఈదురుగాలులకు మైదానంలోని ఎర్రమట్టి ఎగిసి కళ్లలో దుమ్ము పడింది. ప్రాంగణం చుట్టూ ఏర్పాటుచేసిన భారీ కటౌట్లు.. ద్విచక్రవాహనాలు, కార్లపై పడటంతో అవి పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఫ్లెక్సీలు, కుర్చీలను కొందరు తలకు రక్షణగా పెట్టుకున్నారు. సభా ప్రాంగణం పలుచోట్ల బురదమయమైంది.

చంద్రన్న కోసమే వచ్చాం..

వాన వెలిశాక తడిసిపోయారుగా మీ వాహనాల్లోనే ఉండొచ్చు కదా అని మహిళలను ప్రశ్నించగా.. తమ అభిమాన నాయకుడు చంద్రబాబు ప్రసంగం వినడానికే వచ్చామని ఉత్సాహంగా చెప్పారు. వర్షం కారణంగా ఎల్‌ఈడీ తెరలు పనిచేయలేదు. దీంతో దూరంగా ఉన్నవారికి ప్రసంగిస్తున్న వక్తలను చూసేందుకు అవకాశం లేకుండాపోయింది. అయినప్పటికీ శ్రేణుల్లో ఉత్సాహం తగ్గలేదు. వర్షం పడేటప్పుడు ఇతర ప్రాంతాలనుంచి వాహనాల్లో వచ్చేవారు ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో పోలీసులు ట్రాఫిక్‌పై దృష్టి పెట్టకపోవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచాయి. కాసేపు చంద్రబాబు కాన్వాయ్‌ సైతం అందులోనే చిక్కుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని