ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదు

వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని తాను కూడా అనుకుంటున్నట్టు కేంద్ర మాజీ మంత్రి, భాజపా నేత సుజనాచౌదరి వెల్లడించారు.

Published : 02 Jun 2023 04:32 IST

పొత్తులపై నిర్ణయం అధిష్ఠానానిదే
భాజపా నేత సుజనాచౌదరి

ఈనాడు, అమరావతి: వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని తాను కూడా అనుకుంటున్నట్టు కేంద్ర మాజీ మంత్రి, భాజపా నేత సుజనాచౌదరి వెల్లడించారు. ఇప్పటికీ జనసేన భాజపాతోనే కలిసి ఉందని, భవిష్యత్తులో మరో పార్టీ తమతో కలిసి పొత్తుకు వస్తుందా? లేదా? అన్నది అధిష్ఠానం నిర్ణయిస్తుందన్నారు. విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో కలిసి సుజనాచౌదరి మాట్లాడారు. తెదేపా, జనసేన, భాజపా పొత్తుపై కేంద్ర పెద్దలను ఒప్పిస్తానంటూ పవన్‌ వ్యాఖ్యానించారంటే.. అది ఆయన నమ్మకం అయి ఉండొచ్చన్నారు. ఏపీలో అరాచకాల గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని, అంత మెజారిటీ వచ్చినా జగన్‌ ఎందుకు అధ్వానంగా పాలిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. వైకాపా వల్ల గత నాలుగేళ్లుగా రాజధాని ఏదో తెలియని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనను తెదేపా కోవర్టు అని వైకాపా నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై సుజనా స్పందిస్తూ.. ఆ మాట అంటున్న వారే సమాధానం చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మోదీ తొమ్మిదేళ్ల పాలనపై 50 లక్షల కరపత్రాలను ఈ నెల 20 నుంచి ఇంటింటికీ పంచుతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. భాజపాకు మద్దతు ఇచ్చేందుకు ప్రతిఒక్కరూ 9090902024 నంబరుకు మిస్డ్‌ కాల్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఏపీకి కేంద్రం మంజూరు చేసిన ప్రాజెక్టులు, నిధులపై బ్రోచర్‌ను.. సుజనా, సోము వీర్రాజు విడుదల చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు