YS Sharmila: షర్మిల కాంగ్రెస్‌లో చేరతారా?

వైతెపా అధ్యక్షురాలు షర్మిల త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరతారనే ప్రచారం ఊపందుకొంది. తానెందుకు పార్టీని విలీనం చేస్తానంటూ షర్మిల ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నా, పీసీసీ నేతల్లో మాత్రం ఇది చర్చనీయాంశంగా మారింది.

Updated : 22 Jun 2023 07:27 IST

ఊపందుకున్న ప్రచారం..

ఆమె కొట్టిపారేస్తున్నా పీసీసీ నేతల్లో కొనసాగుతున్న చర్చ 

ఈనాడు హైదరాబాద్‌: వైతెపా అధ్యక్షురాలు షర్మిల త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరతారనే ప్రచారం ఊపందుకొంది. తానెందుకు పార్టీని విలీనం చేస్తానంటూ షర్మిల ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నా, పీసీసీ నేతల్లో మాత్రం ఇది చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన తర్వాత కొద్ది రోజులు ప్రచారం జరిగి ఆగిపోయినా, తాజాగా నాలుగు రోజుల క్రితం ఆ పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్యులు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిసి చర్చించినట్లు తెలిసింది. విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్‌గాంధీ తిరిగి వచ్చిన తర్వాత దీనిపై చర్చిస్తానని వేణుగోపాల్‌ చెప్పినట్లు సమాచారం. రాహుల్‌గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లక ముందే తెలంగాణకు చెందిన కొందరు ముఖ్యనాయకులతో చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అటు ఏఐసీసీ, ఇటు పీసీసీ నాయకుల మధ్య కూడా ఈ అంశంపై చర్చ జరిగినట్లు తెలిసింది. కాంగ్రెస్‌లోకి రావడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, ఏపీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే అక్కడ పార్టీ కొంతవరకు తేరుకోవడానికి ఉపయోగపడుతుందనే అభిప్రాయాన్ని తెలంగాణ నాయకులు వ్యక్తం చేసినట్లు తెలిసింది.

అయితే తాను తెలంగాణ కోసం పార్టీ పెట్టానని, తెలంగాణ కోడలిగా ఈ ప్రాంతానికే చెందిన వ్యక్తినంటూ షర్మిల పలు సందర్భాల్లో ప్రస్తావించడాన్ని కూడా కాంగ్రెస్‌ నాయకులు గుర్తు చేస్తున్నారు.  ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలుగా ఆమె అక్కడ పలు కార్యక్రమాలను చేపడుతున్నారు.‘‘కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకొంటుంది.. దీనిపై తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు ఎలా స్పందిస్తారు.. లేకపోతే కాంగ్రెస్‌లో చేరకుండా వైతెపా ఎన్నికలలో అవగాహన వరకే పరిమితం అవుతుందా అన్నదానిపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది’’ అని కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నాయకుడొకరు తెలిపారు. ఇటీవల రాహుల్‌గాంధీ పుట్టినరోజు సందర్భంగా అభినందనలు తెలుపుతూ షర్మిల ట్వీట్‌ చేశారని, గతంలో ఎప్పుడూ ఇలా చేయలేదని గుర్తు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని