kishan Reddy - Bandi Sanjay: బండి స్థానంలో కిషన్‌రెడ్డి?

రాష్ట్ర భాజపాలో కీలక మార్పులకు పార్టీ జాతీయ నాయకత్వం శ్రీకారం చుడుతున్నట్లు తెలిసింది. తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్థానంలో త్వరలో కేంద్ర మంత్రి, సీనియర్‌ నాయకుడు జి.కిషన్‌రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించనుందని విశ్వసనీయంగా తెలిసింది.

Updated : 01 Jul 2023 07:36 IST

సంజయ్‌కి కేంద్రమంత్రివర్గంలో చోటు లేదా పార్టీలో జాతీయ స్థాయి బాధ్యతలు
మంత్రి పదవిలోనూ కిషన్‌రెడ్డి కొనసాగింపు!
ముఖ్య నేతలందరికీ కీలక పదవులు
ఎన్నికల నేపథ్యంలో మార్పులకు భాజపా నాంది

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర భాజపాలో కీలక మార్పులకు పార్టీ జాతీయ నాయకత్వం శ్రీకారం చుడుతున్నట్లు తెలిసింది. తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్థానంలో త్వరలో కేంద్ర మంత్రి, సీనియర్‌ నాయకుడు జి.కిషన్‌రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించనుందని విశ్వసనీయంగా తెలిసింది. సంజయ్‌కి కేంద్ర మంత్రివర్గంలో లేదా పార్టీ జాతీయ నాయకత్వంలో అవకాశం కల్పిస్తారని పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. మూడు నాలుగు రోజుల్లోనే అన్ని అంశాలపై స్పష్టత వస్తుందని పార్టీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై అగ్రనాయకత్వం మూడు నాలుగు రోజులు కీలక కసరత్తు చేసింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా, అగ్రనేత బి.ఎల్‌.సంతోష్‌లు రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై చర్చించారు. నేతల మధ్య విభేదాలు, బండి సంజయ్‌ మూడేళ్ల పదవీకాలం పూర్తికావడం వంటివి చర్చకు వచ్చాయని సమాచారం. ఎన్నికల నేపథ్యంలో కిషన్‌రెడ్డికి రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యత అప్పగించడం సరైన చర్యగా భావించినట్లు తెలుస్తోంది.

సంజయ్‌కు సముచిత ప్రాధాన్యం

రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలు అందించిన సంజయ్‌కు సముచిత ప్రాధాన్యం కల్పించాలని భాజపా నిర్ణయించినట్లు సమాచారం. ఆయన నేతృత్వంలో వివిధ ఉప ఎన్నికలను ఎదుర్కోవడం కీలకమైన హుజూరాబాద్‌, దుబ్బాక ఎన్నికలు, టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు, జీహెచ్‌ఎంసీలో 48 స్థానాల్లో గెలుపువంటి అంశాల నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో అసంతృప్తికి అవకాశంలేకుండా మార్పు చేయాలని అగ్రనాయకత్వం నిర్ణయించిందని పార్టీ నేతలు పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించడం లేదంటే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వంటి కీలక బాధ్యత అప్పగించడంపై భాజపా దృష్టిసారించిందని చెబుతున్నారు. భారాస నుంచి భాజపాలో చేరిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, కాంగ్రెస్‌ నుంచి వచ్చి చేరిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి పార్టీ పదవుల్లో కీలక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిసింది. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు కూడా కొంతకాలంగా అసంతృప్తితో ఉంటూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కేంద్ర జాతీయ నాయకత్వంలో సంజయ్‌కు అవకాశం కల్పిస్తే  సంజయ్‌ సామాజికవర్గానికి చెందిన ఎంపీ ధర్మపురి అర్వింద్‌ లేదా  రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ లేదా ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావుల్లో ఒకరికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం.

తాజా పరిణామాలపై సంజయ్‌ అసంతృప్తి!

తాజా పరిణామాల పట్ల సంజయ్‌ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. శాసనసభ ఎన్నికల వరకు ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతారని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్‌, తాజాగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా ప్రకటించారు. ఇంతలోనే కొత్త పరిణామాలు, ఉద్దేశపూర్వకంగా లీక్‌లు ఇస్తుండటం వంటి అంశాలపై సంజయ్‌ సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీ బాధ్యతలు ఇతరులకు అప్పగిస్తే కార్యకర్తగానే ఉంటూ కార్యక్రమాలను నిర్వహిస్తానని అన్నట్లు సమాచారం. ఇటీవల దిల్లీలో భాజపా ముఖ్యనేత బి.ఎల్‌.సంతోష్‌, ఇతర నేతలు ఆయనతో చర్చించినట్లు సమాచారం. పార్టీ జాతీయ నాయకత్వం త్వరలోనే దిల్లీకి రాష్ట్ర ముఖ్యనేతలను పిలిపించి పదవుల మార్పు, ఎన్నికల కార్యాచరణపై చర్చిస్తుందని తెలిసింది.‘సంజయ్‌ని మారిస్తే భాజపాకు ఆత్మహత్యాసదృశమవుతుంది. కొత్త చేరికలు ఉండకపోగా పార్టీని వీడేవారు ఉంటారు’ అని మాజీ మంత్రి విజయరామారావు శుక్రవారం ట్విటర్‌లో పేర్కొనడం గమనార్హం.

‘ఒకరికి ఒకే పదవి’పై పునరాలోచన

ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాలని భాజపా నిర్ణయించినట్లు సమాచారం. ఒకరికి ఒకే పదవి అనే అంశంపై పునరాలోచిస్తున్నట్టు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికలు జరగనున్న తెలంగాణ, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాల్లో భాజపాయేతర ప్రభుత్వాలు ఉన్నాయి. ఇలాంటిచోట రాష్ట్ర అధ్యక్షులకు ప్రొటోకాల్‌పరంగా ఇబ్బందులు లేకుండా ఉండేలా కేంద్ర మంత్రి పదవితో పాటు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం ద్వారా ప్రయోజనం ఉంటుందని భావిస్తోంది. ఇప్పటికే కేంద్ర మంత్రి పదవుల్లో ఉన్నవారిని అలా కొనసాగిస్తూనే పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అంశంపై దృష్టి సారించిందని తెలిసింది. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే రెండు పదవుల్లోనూ కొనసాగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని