పట్టు వదలని విక్రమార్కులు

చట్టసభకు ఎంపికై అధ్యక్షా...! అని పిలవాలనే కోరిక నేతలకు ఉండటం సహజం. అలాంటి అవకాశం కోసం పరితపించే వారిలో కొందరు శాసనసభలోకి అడుగుపెడితే... మరికొందరు మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు.

Updated : 07 Nov 2023 06:34 IST

వరుసగా పోటీచేస్తున్న నేతలు
ఒకే పార్టీ నుంచి కొందరు.. పార్టీలు మారి మరికొందరు

చట్టసభకు ఎంపికై అధ్యక్షా...! అని పిలవాలనే కోరిక నేతలకు ఉండటం సహజం. అలాంటి అవకాశం కోసం పరితపించే వారిలో కొందరు శాసనసభలోకి అడుగుపెడితే... మరికొందరు మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. వీరు తాజా ఎన్నికల్లోనూ మరోసారి అదృష్టం పరీక్షించుకోబోతున్నారు.


ఆది శ్రీనివాస్‌: వేములవాడలో ఆది శ్రీనివాస్‌ 2009లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి తెదేపా అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబు చేతిలో 1,821 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అనంతరం తెరాసలో చేరి రమేశ్‌ చేతిలోనే 2010 ఉపఎన్నికల్లో 25 వేల ఓట్ల తేడాతో, 2014లో భాజపా అభ్యర్థిగా బరిలో నిలిచి 5,268 ఓట్ల తేడాతో, 2018లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి 28,186 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. మరోసారి కాంగ్రెస్‌ టికెట్‌ పొందారు.


తల్లోజు ఆచారి: కల్వకుర్తి నియోజకవర్గంలో భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2009లో మూడోస్థానంలో నిలిచారు. 2014లో కాంగ్రెస్‌ అభ్యర్థి చల్లా వంశీచంద్‌ చేతిలో 32 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2018లో 344 ఓట్ల తేడాతో తెరాస అభ్యర్థి జైపాల్‌యాదవ్‌ చేతిలో ఓటమి పాలయ్యారు.


లింగాల కమల్‌రాజ్‌: మధిరలో కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్కను ఢీకొంటున్నారు. సీపీఎం అభ్యర్థిగా 2009లో 1,417 ఓట్ల తేడాతో.. 2014లో 12,329 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2018లో తెరాస అభ్యర్థిగా బరిలో నిలిచి 3,567 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. ఇప్పుడు భారాస టికెట్‌ పొందారు.


కేకే మహేందర్‌రెడ్డి: సిరిసిల్లలో 2009 నుంచి కేటీఆర్‌పై పోటీ చేస్తున్నారు. 2009 వరకు తెరాసలోనే ఉన్న తనకు కాదని కేటీఆర్‌కు టికెట్‌ కేటాయించడంతో స్వతంత్రుడిగా బరిలో నిలిచి కేవలం 171 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లో కాంగ్రెస్‌ టికెట్‌ లభించలేదు. 2018లో కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగి 89,009 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ టికెట్‌ ఖరారు అయింది.


కె.శ్రీహరిరావు: నిర్మల్‌లో కె.శ్రీహరిరావు 2009లో తెరాస తరఫున బరిలో నిలిచి 35,458 ఓట్లతో మూడోస్థానంతో సరిపెట్టుకున్నారు. 2014లో తెరాస నుంచే పోటీ చేసి 8,497 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2018లో తెరాస టికెట్‌ దక్కకపోవడంతో ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ టికెట్‌ దక్కింది.


అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌: ధర్మపురిలో కాంగ్రెస్‌ తరఫున 2009 నుంచి తెరాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌పై పోటీ చేస్తున్నారు. తొలిసారి 1484 ఓట్ల స్వల్ప తేడాతో, 2014లో 18,679 ఓట్ల తేడాతో, 2018లో 441 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి కాంగ్రెస్‌ నుంచే పోటీ చేస్తున్నారు.


చల్మెడ లక్ష్మీనర్సింహారావు: కరీంనగర్‌లో 2009లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి రెండోస్థానంలో.. 2014లో మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. 2018లో కాంగ్రెస్‌ టికెట్‌ దక్కలేదు. ఈసారి వేములవాడ భారాస టికెట్‌ వచ్చింది.


కవ్వంపల్లి సత్యనారాయణ: మానకొండూరులో 2009లో ప్రజారాజ్యం అభ్యర్థిగా మూడోస్థానంలో నిలిచారు. 2014లో తెదేపా తరఫున 23,570 ఓట్లు సాధించి మూడోస్థానంతో సరిపెట్టుకున్నారు. 2018లో టికెట్‌ దక్కలేదు. ఈసారి కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేస్తున్నారు.


ఫిరోజ్‌ఖాన్‌: నాంపల్లిలో 2009 నుంచి ఎంఐఎంను ఢీకొంటున్నారు. 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి 6,799 ఓట్ల తేడాతో, 2014లో తెదేపా నుంచి పోటీ చేసి 17,710 ఓట్ల తేడాతో, 2018లో కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేసి 9,675 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మళ్లీ కాంగ్రెస్‌ నుంచే పోటీలో ఉన్నారు. 

 ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని