Kethireddy Pedda Reddy: ఎన్నికలయ్యాక మళ్లీ ఫ్యాక్షన్‌ మొదలు పెడతా

వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ ఫ్యాక్షన్‌ మొదలు పెడతానంటూ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Updated : 28 Dec 2023 10:05 IST

తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి  వివాదాస్పద వ్యాఖ్యలు

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ ఫ్యాక్షన్‌ మొదలు పెడతానంటూ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (Kethireddy Pedda Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ పాత పెద్దారెడ్డిని చూస్తారంటూ జేసీ కుటుంబాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అనంతపురం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాను అవినీతికి పాల్పడుతున్నట్లుగా కరపత్రాలు పంపిణీ చేస్తున్నారని.. ఇలాంటి వాటిని ఇకపై సహించేది లేదని పేర్కొన్నారు. ‘ప్రజలందరినీ భయపెట్టాలనేది నా ఉద్దేశం కాదు. జేసీˆ కుటుంబం, వారి వెంట తిరిగే కొంతమందిని లక్ష్యంగా పెట్టుకుంటాం. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక.. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రెండు, మూడు నెలల్లో వేట మొదలు పెడతాం. చేతనైతే ఎదుర్కోండి. నేను రైతు బిడ్డను. పంటకు పురుగుపడితే ఎలా తీసేయాలో తెలుసు. రాజకీయాలు భ్రష్టు పడితే ఏ విధంగా తొలగించాలో కూడా తెలుసు. ఇది సమయం కాదనే ఊరుకుంటున్నా. తాడిపత్రిలో శాంతిభద్రతలను కాపాడాలనే ఆలోచనతో ఉన్నాం. ఎన్నికలు అయ్యేంతవరకు అదే ఆలోచనతో ఉంటాం. ఎన్నికలు ముగిసిన రెండు, మూడు నెలల్లో 1985 నుంచి 2004 వరకు ఎలా ఉన్నానో ఆ రూపాన్ని చూపిస్తాం. నేను నా పాత జీవితాన్ని మర్చిపోతే దారినపోయే వారు కాలితో తంతారు. అందుకే పాత జీవితంలోకి ఒకసారి మళ్లీ వెళ్లాలనే ఆలోచన ఉంది. దారిన పోయే ప్రతి ఒక్కరూ రాయి వేస్తుంటే ఓపిక నశిస్తోంది. తిరిగి కొట్టే సాహసం నాకుంది. 60 ఏళ్ల వయసులో అన్నీ మానుకోవాలనే ఉద్దేశంతో ఆపేశాం. తాడిపత్రిలో నాలుగున్నరేళ్లలో మార్పు తీసుకొచ్చాం’ అని వ్యాఖ్యానించారు. పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత పెద్ద ఎత్తున ఇసుక, భూములు దోచుకున్నారని, తాడిపత్రిలో అవినీతికి పాల్పడ్డారని కొందరు కరపత్రాలు ముద్రించి పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన జేసీˆ కుటుంబానికి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని