Botsa Satyanarayana: మంత్రి బొత్స కంచుకోటకు బీటలు

మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో అధికార పక్షం నుంచి తెదేపాలోకి వలసలు జోరందుకున్నాయి.

Updated : 13 Jan 2024 07:18 IST

వైకాపా నుంచి తెదేపాలోకి భారీగా చేరికలు

మెరకముడిదాం/గరివిడి, న్యూస్‌టుడే: మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో అధికార పక్షం నుంచి తెదేపాలోకి వలసలు జోరందుకున్నాయి. ఇటీవలే పెదపూతికవలస, గూడెం గ్రామాల నుంచి వైకాపా శ్రేణులు తెదేపాలో చేరగా.. తాజాగా శుక్రవారం రాత్రి మెరకముడిదాం మండలం సోమలింగాపురం పంచాయతీ పరిధిలోని పలువురు నేతలు, కార్యకర్తలు భారీగా చేరారు. వైకాపాకు.. ముఖ్యంగా మంత్రి బొత్స సత్యనారాయణకు కంచుకోటగా నిలుస్తున్న మెరకముడిదాం మండలంలో వైకాపా నుంచి వలసలు ఊపందుకుంటున్నాయి. సోమలింగాపురానికి చెందిన వైకాపా నేతలు శిరువూరి వెంకటపతిరాజు (నాని), శిరువూరి కృష్ణమూర్తిరాజు (మాజీ సర్పంచి), శిరువూరి వాసుదేవరాజు, పెనుమత్స రమణరాజు, ముదునూరు రామ్మూర్తిరాజుల ఆధ్వర్యంలో ఆ గ్రామంతో పాటు గోపన్నవలస, గొల్లలమర్రివలస నుంచి 150 కుటుంబాలు తెదేపా తీర్థం పుచ్చుకున్నాయి. బిళ్లలవలస నుంచి పది కుటుంబాలు సైతం పార్టీలో చేరాయి. వీరందరికీ తెదేపా విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకు ముందు సోమలింగాపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వ అసమర్థ పాలనతో విసిగిపోయిన అన్ని వర్గాలూ తెదేపా వైపు మొగ్గుతున్నాయన్నారు. రానున్న ఎన్నికల్లో విజయనగరం ఎంపీ స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవడం తథ్యమని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని