Botsa: షర్మిల మాటలు వింటుంటే జాలేస్తుంది: బొత్స

ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మాటలు వింటుంటే జాలి వేస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శ్రీకాకుళంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

Updated : 26 Jan 2024 12:35 IST

త్వరలో డీఎస్సీ ప్రకటన మంత్రి బొత్స సత్యనారాయణ

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మాటలు వింటుంటే జాలి వేస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శ్రీకాకుళంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘షర్మిల కొత్తగా ఏదైనా మాట్లాడితే బాగుంటుంది. చంద్రబాబు మాట్లాడిన మాటలే ఆమె అంటున్నారు తప్ప అందులో కొత్తదనం ఏముంది? ప్రత్యేక హోదా ఎవరు తాకట్టు పెట్టారు. ప్యాకేజీ ఎవరడిగారు? ప్యాకేజీ చాలని ఎవరు రాసిచ్చారు? నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాదా? షర్మిల ఆ విషయాలు మర్చిపోయి ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం ఎంత వరకు సమంజసం. కేంద్రం వద్ద వైకాపా ప్రభుత్వం సాగిలపడలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సద్భావన విధానంతో వెళ్తున్నాం. ఎవరి రాజకీయ విధానం వారికి ఉంటుంది. రాష్ట్రంలో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నది మా విధానం. అమరావతి మాత్రమే రాజధాని కావాలన్నది భాజపా విధానం. మరో 70 రోజులు ఆగితే ప్రజలు ఎవరిని ఆదరిస్తారో తెలుస్తుంది’ అని అన్నారు. అనంతరం ఉపాధ్యాయ నియామకాలకు గురించి మంత్రిని ప్రశ్నించగా డీఎస్సీ ప్రకటన రేపే వస్తుందని ముందు చెప్పారు. ఆ తరువాత త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని, అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. రాజ్యసభ ఎన్నికలకు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌ రాజీనామా ఆమోదానికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని