అమిత్‌షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటీ

తెదేపా అధినేత చంద్రబాబు.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో బుధవారం రాత్రి భేటీ అయ్యారు. రాత్రి 11.25 గంటల సమయంలో అమిత్‌షా నివాసానికి చంద్రబాబు వెళ్లారు.

Updated : 08 Feb 2024 13:46 IST

ఈనాడు, దిల్లీ: తెదేపా అధినేత చంద్రబాబు.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో బుధవారం రాత్రి భేటీ అయ్యారు. రాత్రి 11.25 గంటల సమయంలో అమిత్‌షా నివాసానికి చంద్రబాబు వెళ్లారు. అక్కడే ముగ్గురూ సమావేశమయ్యారు. ఎన్డీయే భాగస్వామిగా ఉన్న జనసేన ఇప్పటికే తెదేపాతో పొత్తు ప్రకటించి ఎన్నికల రంగంలో దిగుతున్న నేపథ్యంలో తెదేపానూ ఎన్డీయే కూటమిలోకి ఆహ్వానించడానికి భాజపా పెద్దలు చంద్రబాబుతో సమావేశమైనట్లు భావిస్తున్నారు. బుధవారం సాయంత్రం ఆరున్నరకు దిల్లీ చేరుకున్న చంద్రబాబుకు విమానాశ్రయంలో ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్‌, గల్లా జయదేవ్‌, కె.రామ్మోహన్‌ నాయుడు, రఘురామకృష్ణరాజు స్వాగతం పలికారు. తర్వాత ఆయన హోటల్‌కు వెళ్లి కొంతసేపు విశ్రాంతి తీసుకొని రాత్రి గల్లా ఇంటికి చేరుకున్నారు. అక్కడే పార్టీ ఎంపీలు, ఇతరులతో ఇష్టాగోష్ఠిగా భేటీ అయ్యారు. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్‌ షాలతో రాత్రి 7.30 గంటలకు సమావేశమవుతారన్న ప్రచారం జరిగింది.

అయితే రాత్రి పొద్దుపోయేవరకూ పార్లమెంటు ఉభయసభలు సాగడంతో వారిద్దరూ పార్లమెంటులోనే ఉండిపోయారు. అనంతరం రాత్రి 11.25 గంటలకు భేటీ మొదలై 12.16కు ముగిసింది. భాజపా నాయకత్వం ఎన్డీయే పూర్వ భాగస్వాములన్నింటినీ తిరిగి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో తెదేపా అధినేత వారితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకొంది. ఇటీవల ఎన్డీయే కూటమిలోకి వచ్చిన బిహార్‌ సీఎం నీతీశ్‌కుమార్‌ కూడా చంద్రబాబు కంటే కాస్త ముందు అమిత్‌షా, జేపీ నడ్డాలతో భేటీ అయ్యారు. తర్వాత కమలనాథులు చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఇవి ప్రాథమిక చర్చలు కావొచ్చని, ఇందులో పొత్తులపై ఇరుపార్టీల పెద్దలు ప్రాథమిక అవగాహనకు రావొచ్చన్న భావన ఉంది. అయితే దీని గురించి ఇరుపార్టీల నేతలెవ్వరూ అధికారికంగా స్పందించలేదు. కేంద్రంలో అత్యధిక మెజారిటీతో గెలవడం భాజపాకు ఎంత ముఖ్యమో, రాష్ట్రాన్ని కాపాడుకోవడం తెదేపాకు చారిత్రకంగా అంతే ముఖ్యం కాబట్టి ఇరుపార్టీల మధ్య ఆ దిశలోనే చర్చలు జరిగి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

చంద్రబాబును కలిసిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

ఇటీవల వైకాపాకు రాజీనామా చేసిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బుధవారం రాత్రి దిల్లీలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆయన ఇప్పటివరకూ తెదేపాలో అధికారంలో చేరకున్నా ఇలా వచ్చి కలవడం ప్రాధాన్యం సంతరించుకొంది. తెదేపా ఎంపీలతో పాటు ఆయన కూడా చంద్రబాబుతో జరిగిన ఇష్టాగోష్టి చర్చల్లో పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని