పొత్తు ‘లెక్క’ తేలింది

తెదేపా, జనసేన, భాజపా మధ్య పొత్తు లెక్క తేలింది.  సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. తెదేపా 144, జనసేన 21, భాజపా 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. లోక్‌సభ స్థానాల్లో తెదేపా 17, భాజపా 6, జనసేన 2 చోట్ల పోటీ చేస్తాయి.

Updated : 12 Mar 2024 13:45 IST

17 లోక్‌సభ, 144 అసెంబ్లీ స్థానాల్లో తెదేపా పోటీ
భాజపాకు 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ సీట్లు
2 లోక్‌సభ, 21 శాసనసభ స్థానాల్లో బరిలోకి జనసేన
చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌తో కేంద్ర మంత్రి షెకావత్‌, భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్‌ పండా భేటీ
చంద్రబాబు నివాసంలో 8 గంటలకుపైగా సుదీర్ఘ చర్చల తర్వాత కొలిక్కి..

ఈనాడు, అమరావతి: తెదేపా, జనసేన, భాజపా మధ్య పొత్తు లెక్క తేలింది.  సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. తెదేపా 144, జనసేన 21, భాజపా 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. లోక్‌సభ స్థానాల్లో తెదేపా 17, భాజపా 6, జనసేన 2 చోట్ల పోటీ చేస్తాయి. సోమవారం ఉండవల్లిలోని తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలో 8 గంటలకుపైగా మూడు పార్టీల అగ్రనేతల మధ్య సుదీర్ఘంగా జరిగిన చర్చల్లో... ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో, ఏయే సీట్లలో పోటీ చేయాలన్న అంశంపై తుది నిర్ణయానికి వచ్చారు. దిల్లీ నుంచి వచ్చిన కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు, ఎంపీ బైజయంత్‌ పండాలతో చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సీట్ల సర్దుబాటుపై మొత్తం చర్చలు దిల్లీ నుంచి వచ్చిన భాజపా సీనియర్‌ నాయకులే పూర్తి చేశారు. వారి దగ్గరున్న సమాచారంతో మిత్రపక్ష నేతలతో చర్చించి, ఖరారు చేశారు. చర్చల్లో కుదిరిన అవగాహన మేరకు..  భాజపా అరకు, అనకాపల్లి, విజయనగరం, రాజమహేంద్రవరం, నరసాపురం, తిరుపతి లోక్‌సభ స్థానాల్లో.. జనసేన కాకినాడ, మచిలీపట్నం లోక్‌సభ స్థానాల్లోనూ పోటీ చేయనున్నాయి. రాజమహేంద్రవరం నుంచి భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజుల అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. మిగతా నాలుగు స్థానాల్లోనూ బలమైన అభ్యర్థుల్ని నిలిపేందుకు భాజపా కసరత్తు చేస్తోంది. భాజపా మంగళవారం ప్రకటించే రెండో విడత లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ఒకరిద్దరి పేర్లు ఉండొచ్చని భావిస్తున్నారు. అసెంబ్లీ సీట్లకు వచ్చేసరికి భాజపా ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేలు, కైకలూరు, విశాఖ ఉత్తరం, పాడేరుతోపాటు మరో నాలుగు స్థానాల్లో పోటీ చేసే అవకాశముంది.

రెండంకెల స్థానాల కోసం భాజపా పట్టు!

దిల్లీలో హోం మంత్రి అమిత్‌షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో ఈ నెల 7, 9 తేదీల్లో రెండు దఫాలుగా జరిగిన చర్చల్లో జనసేన, భాజపాలకు కలిపి 30 శాసనసభ, 8 లోక్‌సభ స్థానాలు కేటాయించాలని ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చారు. భాజపా 6, జనసేన 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలన్న నిర్ణయం అప్పుడే జరిగిపోయింది. సోమవారం ప్రధానంగా అసెంబ్లీ స్థానాలపై చర్చ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు రెండంకెల స్థానాలు కావాలని, కనీసం పది సీట్లయినా లేకపోతే ఇబ్బందవుతుందని భాజపా నాయకులు గట్టిగా పట్టుబట్టినట్టు తెలిసింది. తమకు ఏయే స్థానాలు కావాలన్న విషయంలోనూ వారు పూర్తి స్పష్టతతో చర్చల్లో పాల్గొన్నట్టు సమాచారం. 25 అసెంబ్లీ స్థానాల్ని, 10 లోక్‌సభ సీట్లను ముందే ఎంపిక చేసుకున్న భాజపా నాయకులు.. వాటిలో నుంచే 10 అసెంబ్లీ, ఆరు లోక్‌సభ సీట్లు కావాలని కోరారు. సుదీర్ఘ చర్చల అనంతరం పొత్తు ధర్మాన్ని పాటిస్తూ... మిత్రపక్షం భాజపా కోసం జనసేన మూడు అసెంబ్లీ స్థానాల్ని వదులుకోవడానికి సిద్ధపడగా, ముందు నిర్ణయించుకున్నదానికి అదనంగా మరో అసెంబ్లీ సీటును మిత్రపక్షాలకు కేటాయించేందుకు తెదేపా అంగీకరించింది. ఇప్పటికే తెదేపా 94 అసెంబ్లీ, జనసేన ఐదు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాయి. తెదేపా అభ్యర్థుల రెండో జాబితాను ఈ నెల 14న ప్రకటించనుంది. అదే రోజు లోక్‌సభ అభ్యర్థుల్ని కూడా ప్రకటించే అవకాశముంది. మొత్తం అభ్యర్థుల్ని ప్రకటిస్తుందా, మూడో జాబితా కూడా ఉంటుందా అన్న అంశంపై స్పష్టత రాలేదు.

భాజపా నాయకులకు చంద్రబాబు సాదర స్వాగతం

భాజపా అధిష్ఠానం ఆదేశాల మేరకు తెదేపా, జనసేనలతో తదుపరి చర్చల నిమిత్తం షెకావత్‌, పండా ఆదివారం విజయవాడ వచ్చారు. నగరంలోని ఒక హోటల్లో భాజపా రాష్ట్ర నాయకులతోను, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌తోను వారిద్దరూ ఆదివారం విస్తృతంగా చర్చించారు. భాజపా, జనసేన పోటీ చేసే స్థానాలపై ఆ రెండు పార్టీల నేతలు ఈ చర్చల్లో ప్రాథమిక అవగాహనకు వచ్చారు. అనంతరం తమ ప్రతిపాదనలతో సోమవారం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆయా పార్టీల బలాబలాలు, సామాజిక, రాజకీయ పరిస్థితులు, సమీకరణాల్ని దృష్టిలో ఉంచుకుని ఏ పార్టీ ఏ స్థానంలో పోటీ చేస్తే బాగుంటుందన్న అంశంపై మూడు పార్టీల నాయకులూ సుదీర్ఘంగా చర్చించి, పొత్తు ఖరారు చేశారు. సోమవారం మధ్యాహ్నం 12.10 గంటల సమయంలో షెకావత్‌, పండా.. చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. వారికి చంద్రబాబు సాదర స్వాగతం పలికారు. పవన్‌ కల్యాణ్‌ మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో అక్కడికి చేరుకొన్నారు. సోమవారం ఏ సమయమైనా సీట్ల సర్దుబాటు కొలిక్కి తేవాలన్న ఉద్దేశంతో సుదీర్ఘంగా చర్చలు కొనసాగించారు. రాత్రి 8.15 గంటల సమయంలో చర్చలు ముగించుకుని షెకావత్‌, పండా చంద్రబాబు నివాసం నుంచి బయల్దేరారు. వారు వెళ్లిన తర్వాత చంద్రబాబు, పవన్‌ మరో అరగంట మాట్లాడుకున్నారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, కొందరు ఎమ్మెల్యేలు, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తదితరులు చంద్రబాబు నివాసానికి వెళ్లినా చర్చల్లో పాల్గొనలేదు. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తాడిపత్రిలో శంఖారావం సభ ముగించుకుని సాయంత్రం 5 గంటలకు ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్నా, ఆయన కూడా చర్చల్లో పాలుపంచుకోలేదు. చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద మూడు పార్టీలూ కలసి తలపెట్టిన భారీ బహిరంగ సభను ఈ నెల 17నే నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. దానికి ప్రధాని నరేంద్రమోదీతోపాటు భాజపా సీనియర్‌ నేతలు పలువురు హాజరవుతారు.


రాష్ట్రం బాగు కోసం.. ఎన్నికల్లో కలిసి పోటీచేస్తాం

తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి ప్రకటన

ఈనాడు, అమరావతి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శక్తిమంతమైన, దార్శనిక నాయకత్వంలో రాబోయే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో భాజపా, తెదేపా, జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయించినట్లు మూడు పార్టీలూ సోమవారం రాత్రి ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఏపీ అభివృద్ధి, ప్రగతి, ప్రజల స్థితిగతుల్ని మెరుగుపరిచేందుకు మూడు పార్టీలూ కట్టుబడి ఉన్నాయని, తద్వారా అంతర్జాతీయంగా భారతదేశ నాయకత్వం పరిఢవిల్లాలనేది తమ ప్రగాఢ ఆకాంక్ష అని పేర్కొన్నాయి. ఈ సంయుక్త ప్రకటనను తెదేపా అధినేత చంద్రబాబు ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. జనసేన కూడా దీనిపై ప్రకటన విడుదల చేసింది. ఉమ్మడి ప్రకటనలోని ప్రధానాంశాలివీ...

అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం

ఇటీవల దిల్లీలో జరిగిన సమావేశంలో మూడు పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. దానికి కొనసాగింపుగా సోమవారం అమరావతిలో సుదీర్ఘ సమావేశం జరిగింది. కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్‌ పండా, తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఈ చర్చల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ కూటమి ఉంటుంది. సీట్ల పంపకం విషయంలోనూ రాష్ట్ర భవిష్యత్తుకే ప్రథమ ప్రాధాన్యం. ఈ చర్చలతో రాష్ట్ర పురోభివృద్ధికి బలమైన పునాది పడింది. రాష్ట్ర ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ముందుకెళ్తాం. ఎన్‌డీఏ భాగస్వాములుగా రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. తెదేపా 17 లోక్‌సభ, 144 శాసనసభ స్థానాల్లో, భాజపా 6 లోక్‌సభ, 10 శాసనసభ, జనసేన 2 లోక్‌సభ, 21 శాసనసభ స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఏయే స్థానాల్లో ఏ పార్టీ పోటీ చేస్తుందనేదీ త్వరలోనే ప్రకటిస్తాయి.

ప్రజలు ఆశీర్వదించాలి: చంద్రబాబు

భాజపా, తెదేపా, జనసేన పొత్తును రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలని చంద్రబాబు కోరారు. సేవ చేసే అవకాశం కల్పించేలా చారిత్రక తీర్పు ఇవ్వాలన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని