‘వైకాపాలో ఎమ్మిగనూరు టికెట్‌కు రూ.10 కోట్లు అడిగారు’

వైకాపాలో ఉంటే ఎమ్మిగనూరు టికెట్‌ ఇస్తామని ఆ పార్టీ పెద్దలు ప్రలోభపెట్టారని.. రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారని కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్‌ ఆరోపించారు.

Updated : 15 Mar 2024 07:05 IST

ఎంపీలకు కూడా జగన్‌ అపాయింట్‌మెంట్‌ దొరకడం గగనం
తెదేపాలో చేరిన కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపాలో ఉంటే ఎమ్మిగనూరు టికెట్‌ ఇస్తామని ఆ పార్టీ పెద్దలు ప్రలోభపెట్టారని.. రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారని కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్‌ ఆరోపించారు. ఇటీవలే వైకాపాను వీడిన ఆయన గురువారం తెదేపాలో చేరారు. ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం సంజీవ్‌ విలేకర్లతో మాట్లాడుతూ.. ఎలాంటి సీటు ఆశించకుండా, బేషరతుగా తెదేపాలో చేరినట్టు వెల్లడించారు. ‘ఒకే సామాజికవర్గానికి చెందిన ఎమ్మిగనూరు సిటింగ్‌ ఎమ్మెల్యే బుట్టా రేణుకకు, నాకు పోటీ పెట్టాలని చూశారు. నా దగ్గర అంత డబ్బులేదని గౌరవంగా చెప్పి తప్పుకొన్నా. బీసీల్లో బీసీలకు,  ఎస్సీల్లో ఎస్సీలకు, బీసీ, ఎస్సీల మధ్య వివాదాలు సృష్టించే విధ్వంసక రాజకీయాలు వైకాపాలో ఉన్నాయి. ఎంపీనైన నాకు కూడా సీఎం అపాయింట్‌మెంట్‌ దొరకడం కష్టం’ అని ధ్వజమెత్తారు. ‘వైకాపాలో బీసీలకు పదవులున్నాయి కానీ అధికారాలు లేవు. ఎంపీగా ఉండీ నా ప్రాంతం నుంచి వలసలు నివారించలేకపోయా. కనీసం తాగునీరు ఇవ్వలేకపోయాను. డీపీఆర్‌లు సిద్ధం చేయడమే కానీ నిధులు విడుదల చేయలేదు. అలాంటప్పుడు ఇక రాజకీయాలు, పదవులు ఎందుకనిపించి వైకాపాను వీడాను. కర్నూలు ప్రాంతంలో నెలకొన్న సమస్యల్ని చంద్రబాబుకు వివరించాను. ఆయన సానుకూలంగా స్పందించారు’ అని సంజీవ్‌ వివరించారు. ఆయనతో పాటు పద్మశాలి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పి.రమేశ్‌ తదితరులు తెదేపాలో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని