చీరాల వైకాపాలో ముసలం

బాపట్ల జిల్లా చీరాల వైకాపాలో ముసలం రేగింది. స్థానికులకే టికెట్‌ ఇవ్వాలనే డిమాండ్‌ ఊపందుకుంటోంది.

Published : 27 Mar 2024 09:03 IST

అనుచరులతో ఆమంచి భేటీ
స్థానికులకే టికెట్‌ ఇవ్వాలని చర్చ

ఈనాడు, బాపట్ల: బాపట్ల జిల్లా చీరాల వైకాపాలో ముసలం రేగింది. స్థానికులకే టికెట్‌ ఇవ్వాలనే డిమాండ్‌ ఊపందుకుంటోంది. ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత ఆమంచి కృష్ణమోహన్‌ పందిళ్లపల్లిలోని తన నివాసంలో సోమవారం రాత్రి అనుచరులతో భేటీ అయ్యారు. ఎక్కడనుంచో వచ్చినవారికి టికెట్‌ ఇవ్వడమేంటి, స్థానికులకే ఇవ్వాలని ఆ భేటీలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. మంగళవారం చీరాలలో ఆమంచి అనుచరులు సమావేశాలు నిర్వహించుకున్నారు. కరణం వెంకటేష్‌కు కాకుండా స్థానికుడైన ఆమంచికే టికెట్‌ ఇవ్వాలని డిమాండు చేశారు. ఇప్పటికే కరణం, ఆమంచి వర్గాల మధ్య కొంతకాలంగా పోరు తీవ్రతరమైంది. 2019 ఎన్నికల్లో చీరాలలో వైకాపా తరఫున పోటీచేసిన ఆమంచిపై తెదేపా అభ్యర్థి కరణం బలరాం గెలిచారు. అనంతరం ఆయన వైకాపా పంచన చేరారు. తర్వాత ఆయన కుమారుడు కరణం వెంకటేష్‌ను నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా నియమించి, ఆమంచిని పర్చూరుకు మార్చారు. తొలుత మొరాయించినా.. తర్వాత ఆమంచి పర్చూరు వెళ్లారు. అక్కడ ఉంటూనే చీరాలలోనూ తన రాజకీయ కార్యకలాపాలను ఆయన కొనసాగించారు. చీరాల టికెట్‌ కోసం ప్రయత్నాలూ చేశారు. ఇటీవల ఆమంచిని పర్చూరు నుంచి కూడా తప్పించారు. దీంతో ఆయన చీరాలలోనే ఉంటూ తన టికెట్‌ తనకే ఇవ్వాలని కోరారు. సోమవారం రాత్రి సమావేశం నిర్వహించి, తన కార్యాచరణను ఒకటి రెండు రోజుల్లో చెబుతానని అనుచరులకు చెప్పారంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని