బ్రెజిల్‌ నుంచి వచ్చిన కంటెయినర్‌తో విజయసాయిరెడ్డికి సంబంధం

మాదకద్రవ్యాలతో బ్రెజిల్‌ నుంచి విశాఖపట్నం పోర్టుకు వచ్చిన డ్రైడ్‌ ఈస్ట్‌ కంటెయినర్‌తో విజయసాయిరెడ్డికి కచ్చితంగా సంబంధం ఉందని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు.

Updated : 27 Mar 2024 06:47 IST

తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి

ఈనాడు, నెల్లూరు: మాదకద్రవ్యాలతో బ్రెజిల్‌ నుంచి విశాఖపట్నం పోర్టుకు వచ్చిన డ్రైడ్‌ ఈస్ట్‌ కంటెయినర్‌తో విజయసాయిరెడ్డికి కచ్చితంగా సంబంధం ఉందని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని తెదేపా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘బ్రెజిల్‌ అధ్యక్షుడికి ట్వీట్‌ పెట్టానని, అదేం తప్పు కాదని విజయసాయిరెడ్డి అంటున్నారు. తర్వాత చాలా దేశాల్లో ఎంతోమంది అధ్యక్షులు, ప్రధానులు అయ్యారు. వారందరికీ ట్వీట్లు ఎందుకు పెట్టలేదు? బ్రెజిల్‌లో లావాదేవీలు ఉండబట్టే.. కాపాడమని అక్కడి ప్రెసిడెంట్‌కు ట్వీట్‌ పెట్టారు’ అని ఆరోపించారు. ‘చంద్రబాబు సామాజికవర్గం వారి సంస్థకు చెందిన కంటెయినర్‌ కాబట్టి అందులో చంద్రబాబుకూ సంబంధాలున్నాయంటున్నారు. జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించిన సీబీఐ కేసుల్లో ఆయనతోపాటు నిందితుడైన నిమ్మగడ్డ ప్రసాద్‌ ఎవరు? సాక్షిలో రూ.147 కోట్ల పెట్టుబడి పెట్టిన పొట్లూరి వరప్రసాద్‌ ఎవరు? ఎమ్మార్‌ కోనేరు సత్యనారాయణ, లగడపాటి కుటుంబం.. వీరంతా ఏ సామాజికవర్గం? వారిని వ్యాపారాల్లో, అక్రమ వ్యవహారాల్లో పక్కనపెట్టుకున్నప్పుడు వారి సామాజికవర్గం గుర్తు రాలేదా?’ అని ప్రశ్నించారు. ‘డ్రగ్స్‌ కేసులోనూ ఆ కుటుంబాన్ని విజయసాయిరెడ్డి ఇరికించారు. ఆ సామాజికవర్గమే దీనికి కారణమంటున్నారు’ అని పేర్కొన్నారు. అయిదేళ్లుగా విశాఖపట్నం నగరాన్ని పూర్తిగా దోచేసిన ఎంపీ విజయసాయిరెడ్డి.. ఇప్పుడు నెల్లూరుకు వచ్చారని, ఇక్కడి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆనం సూచించారు.

విజయసాయిరెడ్డి కుటుంబానికి వ్యాపారాల్లేవా?

తనకు ఇల్లు లేదని, వ్యాపారాలు లేవని విజయసాయిరెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆనం వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. ‘ఆయనకు జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో వాటాల్లేవా? వాటిని అమ్ముకుని బయటకు రాలేదా? నెయిల్‌డాట్‌ ఇన్‌ఫ్రాటెక్‌, జీఫ్లెక్స్‌ కన్సల్టెన్సీ, గ్లాడ్యులస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, జూరి మినరల్స్‌, అయాన్‌ రియల్టర్స్‌, మెరీనా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, పవన్‌ గంగా పవర్‌, మొహారీ ఎస్టేట్స్‌ ఇవన్నీ మీ కుటుంబాలకు చెందినవి కావా’ అని ప్రశ్నించారు. ‘13 సీబీఐ కేసుల్లో నిందితుడైన విజయసాయిరెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నారు. తమ కుటుంబానికి చెందిన వేణుంబాక ఫౌండేషన్‌ ద్వారా 13 ఏళ్లలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు సున్నా. తనకు పదేళ్లలో వచ్చిన రూ.50 కోట్ల ఎంపీ ల్యాడ్స్‌ నిధుల నుంచి నెల్లూరుకు ఎంత ఖర్చు పెట్టారో చెప్పగలరా?’ అని ప్రశ్నించారు.

జగన్‌తో ప్రెస్‌మీట్‌ పెట్టిస్తారా?

‘ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి మహిళలను గౌరవించడం నేర్చుకోవాలి. ఒక మహిళకు అండగా నిలిచిన ప్రభాకర్‌రెడ్డిని ఆయన అభినందించాలి’ అని ఆనం పేర్కొన్నారు. ‘ప్రసన్నకుమార్‌రెడ్డి కోరుతున్నట్లు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డి కలిసి ప్రెస్‌మీట్‌ పెడతారు.. సాక్షితో పాటు మీడియా అందర్నీ ఆహ్వానిస్తాం. అయితే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో ఈటీవీ, ఏబీఎన్‌, టీవీ5, మహాటీవీ, ప్రైమ్‌ న్యూస్‌ తదితరులందరితో ఒక ప్రెస్‌మీట్‌ పెట్టించగలరా?’ అని సవాల్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని