భారాస అధ్యక్షుడు కేసీఆర్‌కు ఈసీ నోటీసు

ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ భారాస అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటీసు జారీ చేసింది.

Updated : 17 Apr 2024 06:33 IST

సిరిసిల్లలో చేసిన వ్యాఖ్యలపై 18లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ భారాస అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటీసు జారీ చేసింది. ఈ నెల అయిదో తేదీన సిరిసిల్లలో కేసీఆర్‌ ప్రసంగంలో.. ప్రత్యర్థి పార్టీపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారంటూ వచ్చిన ఫిర్యాదుపై ఈ నోటీసు జారీ చేస్తున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ నెల 18వ తేదీ ఉదయం 11 గంటల్లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. కేసీఆర్‌ సిరిసిల్లలో అవమానకర, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, అవి ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా ఉన్నాయంటూ పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ ఈ నెల ఆరో తేదీన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.  ఎన్నికల సంఘం కేసీఆర్‌కు నోటీసు జారీ చేస్తూ 2019 మే మూడో తేదీన కరీంనగర్‌లో చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని, మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేసినట్లు గుర్తుచేసింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2023 అక్టోబరు 30వ తేదీన బాన్సువాడ నియోజకవర్గంలో చేసిన ప్రసంగం విషయంలో కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళి మేరకు వ్యవహరించాలని కేసీఆర్‌కు సలహా ఇచ్చినట్లు నోటీసులో పేర్కొంది. ‘ఎన్నికల నియమావళిని అందరూ తూచా తప్పకుండా పాటించాలని గత నెలలో అన్ని రాజకీయ పార్టీలకు స్పష్టం చేశాం. మీరు భారాస అధ్యక్షుడే కాకుండా మాజీ ముఖ్యమంత్రి కూడా అయినందున ప్రవర్తన నియమావళిని పాటిస్తారని ఆశిస్తున్నాం. వాస్తవ విరుద్ధమైన అంశాలు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయటం.. ప్రత్యర్థి పార్టీ లేదా అభ్యర్థులను అవమానించటమే. సిరిసిల్లలో ఈ నెల అయిదో తేదీన మీరు చేసిన వ్యాఖ్యల్లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు ప్రాథమిక ఆధారాలు మా దృష్టికి వచ్చాయి. ఆ మేరకు నోటీసు జారీ చేస్తున్నాం. గురువారం ఉదయంలోగా వివరణ ఇవ్వాలి’ అని కేంద్ర ఎన్నికల సంఘం ఆ నోటీసులో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని