జీవో 37 రద్దు చేసే వరకు పోరాటం: మహేశ్వర్‌రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం సింధు ఫౌండేషన్‌కు హైదరాబాద్‌లో కేటాయించిన 15 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి జీవో 37ను రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని భాజపా శాసన సభాపక్ష నేత ఎ.మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 17 Apr 2024 04:20 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం సింధు ఫౌండేషన్‌కు హైదరాబాద్‌లో కేటాయించిన 15 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి జీవో 37ను రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని భాజపా శాసన సభాపక్ష నేత ఎ.మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. రద్దు చేయని పక్షంలో ఏడాదికి ఎకరాకు రూ.50 కోట్లు చొప్పున లీజు మొత్తాన్ని వసూలు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినట్లు తెలిపారు. మంగళవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి రైతు రుణమాఫీ హామీ ఇవ్వడం కొత్తేమీ కాదన్నారు. గతంలో డిసెంబరు 9లోపు చేస్తామని చెప్పి అమలు చేయలేదని విమర్శించారు. రుణమాఫీకి రూ.35 వేల కోట్లు కావాలని, రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయానికి కేటాయించింది రూ.19 వేల కోట్లు మాత్రమే అని చెప్పారు. ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేయకుంటే సీఎం పదవికి రాజీనామా చేస్తానని చెప్పగలరా అని సవాల్‌ చేశారు.

మభ్యపెట్టడానికే రుణమాఫీ ప్రకటన: లక్ష్మణ్‌

పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టడానికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.2 లక్షల రైతు రుణమాఫీ ప్రకటించారని భాజపా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల కోడ్‌ పేరుతో హామీలు అమలు చేయలేకపోతున్నామని రేవంత్‌ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పడం ఖాయమని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని