శ్రీరామనవమి వేదికగా రాజకీయం

అయోధ్యలో రామ మందిరం అంశం తర్వాత ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో శ్రీరామ నవమిని రాజకీయ పార్టీలు ప్రచార వేదికగా ఎంచుకుంటున్నాయి.

Published : 17 Apr 2024 04:40 IST

పశ్చిమ బెంగాల్‌లో పోటాపోటీగా తృణమూల్‌, భాజపా ఏర్పాట్లు

కోల్‌కతా: అయోధ్యలో రామ మందిరం అంశం తర్వాత ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో శ్రీరామ నవమిని రాజకీయ పార్టీలు ప్రచార వేదికగా ఎంచుకుంటున్నాయి. బుధవారం జరిగే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తృణమూల్‌, భాజపా పోటీ పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా భాజపా భారీ ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అయితే ఎన్నికల ముంగిట మతపరమైన ఘర్షణలను సృష్టించేందుకు భాజపా ప్రయత్నిస్తోందని తృణమూల్‌ అధినాయకురాలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. గతంలో కొన్ని ప్రాంతాల్లోనే శ్రీరామ నవమి వేడుకలు జరిగేవి. ఈసారి రాష్ట్రం మొత్తం జరిగేలా భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికే విశ్వ హిందూ పరిషత్‌ రామ్‌ మహోత్సవ్‌ పేరుతో ఈ నెల 9 నుంచి 23 వరకూ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. హిందువుల ఓట్లను గంపగుత్తగా సాధించాలని భాజపా ప్రయత్నిస్తుంటే తృణమూల్‌ ఆ పార్టీతో పోటీ పడుతోంది. హిందువుల ఓట్లపై పట్టు సాధించాలని ఆ పార్టీ కూడా శ్రీరామ నవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే సెలవు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలను నిర్వహించాలని నిర్ణయించింది. 17వ తేదీన రాష్ట్రంలోని గ్రామాలు, మున్సిపల్‌ వార్డుల్లో ర్యాలీలను నిర్వహించాలని నిర్ణయించామని, ఇవి దాదాపుగా 5,000 వరకూ ఉంటాయని వీహెచ్‌పీ జాతీయ సహాయ కార్యదర్శి సచ్చీంద్రనాథ్‌ సింఘా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని