Harish Rao: తెలంగాణ ఆచరిస్తే.. దేశమంతా అనుసరించేలా కేసీఆర్ చేశారు: హరీశ్‌రావు

రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో నూతనంగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిససి హరీశ్ రావు ప్రారంభించారు.

Published : 17 Aug 2023 18:25 IST

మహేశ్వరం: నాడు తెలంగాణలో 3 మెడికల్ కళాశాలలే ఉండేవని.. ఇప్పుడు ఆ సంఖ్య 33కు చేరిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో నూతనంగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి హరీశ్ రావు ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మంత్రి సబితా ఇంద్రారెడ్డి అంటే ముఖ్యమంత్రికి ఎంతో గౌరవం. ఆమె అడగగానే జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేశారు. ఎదిగిన నాయకురాలు ఉంటే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. మహేశ్వరం నియోజకవర్గంలో 550 పడకలతో ఆస్పత్రి నిర్మాణం చేపడతాం. వారం పది రోజుల్లో మహేశ్వరం మెడికల్ కళాశాల శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తాం. ఎన్నికలప్పుడు వచ్చే నాయకులు కొందరైతే.. ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉండే నాయకురాలు సబిత. అధికారంలో ఉన్నా లేకపోయినా ఆమె ఎప్పుడూ ప్రజలతోనే ఉంటారు. విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం సబితా ఇంద్రారెడ్డికి సవాల్ లాంటిది. ఎన్నో విద్యా సంఘాలతో నవ్వుతూ మాట్లాడుతూ సమస్యలు పరిష్కరిస్తుంటారు.

ప్రస్తుతం దేశమంతా తెలంగాణ వైపు చూస్తోంది. చెరువుల అభివృద్ధిలో కర్ణాటక మనల్ని కాపీ కొడుతోంది. తెలంగాణ ఆచరిస్తే.. దేశం మొత్తం అనుసరించేలా కేసీఆర్ చేశారు. 
మూడు గంటలు కరెంట్ ఇస్తే మూడు ఎకరాలు పారుతుందో లేదో రైతులు చెప్పాలి. 3 గంటలు కరెంట్ కావాలంటే కాంగ్రెస్‌కు ఓటు వేయాలి. 24 గంటలు కరెంట్ కావాలంటే కేసీఆర్‌కు ఓటు వేయండి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దత్తత తీసుకున్న తిమ్మాపూర్‌లో రూపాయి పనిచేయలేదు. బావుల వద్ద మీటర్లు పెట్టలేదని తెలంగాణకు కేంద్రం రూ.35వేల కోట్ల ఆపింది. రైతు రుణాలను లక్ష రూపాయల వరకు పూర్తిగా మాఫీ చేస్తాం. 24 గంటల నిరంతర విద్యుత్‌ కోసం కేసీఆర్ మ్యాజిక్ చేయలేదు, మంత్రం వేయలేదు.
ఆయన కష్టపడటం వల్లే 24 గంటల కరెంట్ రైతులకు అందుతోంది. రంగారెడ్డి జిల్లాలో 95 వేల మంది మహిళలకు వడ్డీతో సహా అభయహస్తం డబ్బులు వారం రోజుల్లోగా ఖాతాల్లో పడతాయి’’ అని హరీశ్‌రావు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు