Harish Rao: గత ప్రభుత్వంపై బురదజల్లేందుకే శ్వేతపత్రం: హరీశ్‌ రావు

నీటిపారుదల రంగంపై అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. దీనిపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు.

Updated : 17 Feb 2024 13:45 IST

హైదరాబాద్‌: నీటిపారుదల రంగంపై అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. దీనిపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. మంత్రి లేవనెత్తిన అంశాలపై భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు వివరణ ఇచ్చారు.

‘‘రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో కొన్ని అంశాలు సత్యదూరంగా ఉన్నాయి. గత ప్రభుత్వంపై బురదజల్లేందుకే ఈ నివేదిక తీసుకొచ్చారు. ఇందులో అబద్ధాలు ఉన్నాయని నేను రుజువు చేస్తాను. మిడ్‌మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయని మంత్రి ఉత్తమ్‌ చెప్పారు. అయితే, 2014 నాటికి నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి మిడ్‌మానేరు ప్రాజెక్టుకు సంబంధించి రూ.106 కోట్ల విలువైన పనులు మాత్రమే జరిగాయి. భారాస ప్రభుత్వం వచ్చాక రూ.775 కోట్లు ఖర్చు చేసి మూడేళ్ల తర్వాత ప్రాజెక్టును పూర్తి చేశాం.

ఖర్చులు వర్సెస్‌ ఆయకట్టు విషయంలో శ్వేతపత్రంలో రెండు చోట్ల వేర్వేరుగా ప్రస్తావించారు. 2014కు 57.79 లక్షల ఎకరాలకు నీరిస్తే.. రూ. 54,234 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఇదే నివేదికలో మరో చోట 1956-2014 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణలో రూ.54,234 కోట్లు ఖర్చు పెట్టి 41.76 లక్షల ఎకరాలను నీరిచ్చాం అని చెప్పారు. ఒకే అంశంపై భిన్నమైన సమాచారాన్ని నివేదికలో పొందుపర్చారు. ఖర్చులో ఎలాంటి మార్పు లేదు. నీరందించిన ఆయకట్టు విస్తీర్ణంలో మాత్రం తేడా ఉంది’’

‘‘రాయలసీమ ఎత్తిపోతలపై మంత్రి మాట్లాడారు. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు అప్పటి ప్రభుత్వం (భారాస) కేంద్రానికి ఫిర్యాదు చేయలేదని అన్నారు. ఈ అంశానికి సంబంధించి గతంలోనే పూర్తి ఆధారాలతో సహా నేను పూర్తి వివరణ ఇచ్చాను. అయినా సరే మళ్లీ అబద్ధాలు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు జీవో వచ్చింది 5/5/2020లో. ఈ జీవో రాకముందే పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా 29/1/2020న కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాం. మే 5న జీవో వస్తే వారం రోజుల వ్యవధిలోనే మరోసారి కేంద్రానికి, కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేశాం. ఆ లెటర్లు కావాలంటే సభలో ప్రవేశపెడతాం. మేం అసలు ఫిర్యాదే చేయలేదనే సత్యదూరమైన విషయాన్ని పదేపదే చెబుతున్నారు. ఇది పద్ధతి కాదు’’ అని హరీశ్‌ వివరణ ఇచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని