Arvind Kejriwal: నేను ప్రజల మనిషిని.. అదే వాళ్లకు నచ్చట్లేదు: కేజ్రీవాల్

తనపై ప్రజలు చూపిస్తున్న అభిమానం.. కేంద్రంలోని భాజపా పెద్దలకు సమస్యగా మారిందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ అన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన అధికార భాజపా లక్ష్యంగా పలు విమర్శలు చేశారు. 

Published : 09 Nov 2022 01:08 IST

అహ్మదాబాద్‌: గుజరాత్ శాసనసభ ఎన్నికలకు తోడు దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎంసీడీ)కు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆప్‌, భాజపా ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశాయి. కేజ్రీవాల్ లక్ష్యంగా భాజపా విమర్శనాస్త్రాలు సంధిస్తుండగా.. ఆప్‌ కూడా అదే స్థాయిలో ప్రతిస్పందిస్తోంది. మంగళవారం గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ భాజపాపై విమర్శలు గుప్పించారు. ‘‘ప్రజలు నన్ను అభిమానించడం వారి నచ్చడంలేదు. అందుకే, నాపై ఏవేవో విమర్శలు చేస్తున్నారు’’ అని అన్నారు.  ఆప్‌ అవినీతిపరుల పార్టీ అని భాజపా చేస్తున్న ఆరోపణలపై ఆయన దీటుగా స్పందించారు. ‘‘పంజాబ్‌ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్‌ టెర్రరిస్ట్‌ అని ప్రధాని మోదీ అన్నారు. దానిపై విచారణ చేస్తామని హోంమంత్రి అమిత్‌ షా చెప్పారు. ఇప్పడు, గుజరాత్‌ అసెంబ్లీ, దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు రావడంతో కేజ్రీవాల్ అవినీతిపరుడు అని మళ్లీ ఆరోపిస్తున్నారు. మీ ఆరోపణలు నిజమైతే నన్ను వెంటనే అరెస్టు చేయండి ’’ అని కేజ్రీవాల్‌ భాజపాకు సవాల్ విసిరారు. ‘‘కేజ్రీవాల్‌ టెర్రరిస్టు కాదు, అవినీతిపరుడు కాదు.. ఆయన ప్రజలకు ఇష్టమైనవాడు. భాజపాకు ఆయనతోనే సమస్య’’ అని వ్యాఖ్యానించారు.  

గత కొద్దిరోజులుగా ఆర్థిక నేరగాడు సుకేశ్‌ చంద్రశేఖర్‌ ఆప్‌ నేతలపై అవినీతి ఆరోపణలు చేస్తున్నాడు. పంజాబ్‌, దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సంద్భంగా ఆప్‌కు భారీ మొత్తంలో నగదు అందజేసినట్లు తెలిపాడు. అతడి ఆరోపణలనే భాజపా విమర్శనాస్త్రాలుగా మలచుకుంది. గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఆప్‌ అన్నిస్థానాల్లో తన అభ్యర్థులను బరిలోకి దించుతోంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 30 సీట్లలో పోటీ చేసినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇప్పటికే ఆప్‌ సీఎం అభ్యర్థిగా టీవీ యాంకర్‌ ఇసుదాన్‌ గఢ్వీని ఎంపిక చేసింది. డిసెంబర్‌ 1న తొలి దశ పోలింగ్‌, డిసెంబరు 5న రెండో విడత జరగనుంది. డిసెంబరు 8న హిమాచల్ ప్రదేశ్‌తో పాటే ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. మరోవైపు దిల్లీ పురపాలక సంఘంలో 250 కార్పొరేషన్‌ స్థానాలకు డిసెంబర్‌ 4న పోలింగ్ నిర్వహించి, డిసెంబర్‌7న ఫలితాలు ప్రకటించనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని