Gujarat Election 2022: మా సీఎం ఎవరో తెలియదు..మా సీఎం, పీఎం మోదీనే

మోదీయే మా సీఎం, పీఎం గ్రామీణ స్థాయిలో చాలా మంది ప్రజల మాట ఇది. అంతలా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారాయన. తాజా ఎన్నికల్లోనూ ప్రజలు ఆయన బ్రాండ్‌ను చూసే ఓటు వేశారని విశ్లేషకులు చెబుతున్నారు.

Updated : 08 Dec 2022 21:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కచ్‌.. గుజరాత్‌లోని ఓ మారుమూల ప్రాంతం. అక్కడికి వెళ్లి.. మీ సీఎం ఎవరు? అని ప్రశ్నిస్తే వాళ్లంతా ‘ఏమో మాకేం తెలుసు’ అని సమాధానమిస్తారు. అదే.. మీ ప్రధాని ఎవరు? అంటే ముక్త కంఠంతో ‘మోదీ’ అని చెబుతారు. ‘మా సీఎం, పీఎం ఆయనే’ అందరిదీ ఇదే మాట. గుజరాత్‌ ప్రజల్లో మోదీ స్థానం అలాంటిది. కుటుంబంలో ఓ వ్యక్తిగా ప్రజల్లో మమేకమైపోయారు.

ప్రధాని మోదీ.. రాష్ట్రంలో క్రియాశీల రాజకీయాలను వదిలి.. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత కూడా ఆయన ఛరిష్మా ఏమాత్రం తగ్గలేదు. మూడు విడతల్లో దాదాపు 13 ఏళ్లపాటు ఆయన గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయన.. ఆ తర్వాత సీఎం పదవికి రాజీనామా చేసి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. మోదీ తర్వాత ఆనందీబెన్‌ పటేల్‌, విజయ్‌ రూపానీ, గత ఏడాది సెప్టెంబరులో భూపేంద్ర పటేల్ సీఎం బాధ్యతలు చేపట్టారు. కానీ, వీరికి గ్రామీణ స్థాయిలో పెద్దగా గుర్తింపు లేదనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికీ మోదీనే తమ సీఎం అని చాలా మంది విశ్వసిస్తుంటారు.

ప్రజల విశ్వాసాన్ని మోదీ కూడా ఏనాడూ వమ్ము చేయలేదు. జాతీయ రాజకీయాల్లో, ప్రధానిగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, రాష్ట్రం గురించి ఏమాత్రం ఏమరపాటుతో వ్యవహరించలేదు. ఎప్పటికప్పుడు రాష్ట్ర అభివృద్ధిని గురించి ఆరా తీస్తూ అవసరమైన మార్పులు సూచిస్తున్నారు. రాజకీయంగానూ నిర్ణయాలు తీసుకోవడంలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీపై వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలియగానే.. ఆయన స్థానంలో ఎన్నికలకు ముందు భూపేంద్ర పటేల్‌కు పగ్గాలు అప్పగించారు. తాను గుజరాతీనైనందుకు ఎంతగానో గర్విస్తున్నాని, గుజరాతీగానే ఉంటానంటూ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించిన ఆయన అక్కడి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకోక ముందు నుంచే ప్రజలతో మరింతలా మమేకమయ్యేందుకు మోదీ ప్రయత్నించారు. ఈ క్రమంలోనే వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల పేరిట రాష్ట్రంలో పర్యటించి..తాను ఇంకా రాష్ట్ర రాజకీయాలను వదలిపెట్టలేదనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. దాదాపు 20 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి.. తానే ముఖ్యమంత్రి అభ్యర్థిని అన్నంతలా ప్రచారం చేశారు. మోదీ బాండ్ర్‌ ఇమేజ్‌ తోనే భాజపా ఇంతటి ఘన విజయం సాధించిందనడం ఎవరూ కాదనలేని వాస్తవం. 

కేవలం రాజకీయంగానే కాకుండా అభివృద్ధి పరంగానూ మోదీ స్వరాష్ట్రంపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. వివిధ రకాల ప్రాజెక్టులు రాష్ట్రానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు మంజూరు చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. విద్య, వైద్యం, ఎలక్ట్రానిక్స్‌,సాంకేతికత ఇలా అన్ని రంగాల్లోనూ రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తడానికి ప్రధాన కారణం మోదీ అనడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు. గత పదేళ్లలో కేవలం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సంస్థ రూ. 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఆ ఒక్కటే కాదు అదానీ, టాటా లాంటి పెద్ద పెద్ద సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయంటే కారణం మోదీయే. ముంబయి నుంచి దిల్లీ వరకు చేపట్టిన ఎక్స్‌ప్రెస్‌ హైవేను అహ్మదాబాద్‌, వడోదర, సూరత్‌ మీదుగా మళ్లించారు. కేవలం పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా ఉపాధి, ఉద్యోగాల కల్పన పేరుతో గ్రామీణ ప్రజల మనసుల్లోనూ మోదీ చెరగని ముద్ర వేసుకున్నారు. అందుకే గ్రామీణస్థాయిలో మోదీ పేరుతోనే ఆ పార్టీ నాయకులు ఓట్లు అభ్యర్థించారు.

‘‘దిల్లీకి రాజైనా.. తల్లికి కొడుకే’’ అన్న చందంగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లినా ప్రధాని మోదీ మాత్రం తన రాష్ట్రంపై అభిమానాన్ని వదులుకోలేదు. అలాగే అక్కడి ప్రజలు కూడా సీఎం ఎవరైతే మాకేంటి? మాకు అండగా మోదీ ఉన్నారు.. ఆయనే మా సీఎం.. పీఎం అంటూ ఏకంగా రికార్డు స్థాయిలో 156 స్థానాలను కట్టబెట్టారు. క్షేత్రస్థాయిలో ఎంతో మంది నాయకులు, స్టార్‌ క్యాంపెయినర్లు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రముఖులు ప్రచారంలో భాగం అయ్యుండొచ్చు. కానీ, మోదీ బ్రాండ్‌తోనే ప్రజలు భాజపాకు ఓటు వేశారనడం కాదనలేని నిజం.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని