KA Paul: నాకు ఉప ప్రధాని పదవి ఇస్తానన్నారు: కేఏ పాల్‌

ప్రజల సమస్యలు ఏంటి? వాటిని ఎలా పరిష్కరించాలన్న దానిపై చర్చ జరగాల్సింది పోయి ఒకరినొకరు తిట్టుకోవడంతోనే

Updated : 23 Apr 2022 17:05 IST

హైదరాబాద్‌: ప్రజల సమస్యలు ఏంటి? వాటిని ఎలా పరిష్కరించాలన్న దానిపై చర్చ జరగాల్సింది పోయి ఒకరినొకరు తిట్టుకోవడంతోనే రాజకీయ నాయకులు సమయం గడిపేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ మండిపడ్డారు. హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘అభివృద్ధి కోసమే నేను అప్పట్లో తెలంగాణకు మద్దతిచ్చాను. కానీ, ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. రాష్ట్రం అప్పుల పాలైంది.  కేటీఆర్ భాజపా తప్పులను ఎత్తి చూపుతున్నారు. తెరాస తప్పులను ఎందుకు కప్పి ఉంచుతున్నారు.  తెలుగు రాష్ట్రాల్లో పాలన గాడి తప్పింది. పోటీ పడి మరీ ప్రజల సొమ్ము దోచుకుంటున్నారు. లక్షల కోట్ల రూపాయలను ఛారిటీల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పంచి పెట్టాను. తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దిగజారి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితి ఏర్పడింది. భాజపా నాకు రాజ్యసభ ఎంపీ ఇచ్చి, ఉప ప్రధాని ఇస్తా అన్నారు. కానీ, నేను ఒప్పుకోలేదు. డబ్బులతో సొంత మీడియాలు పెట్టుకొని సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. బడుగు బలహీనర్గాల ప్రజలు ఇప్పుడున్న అధికార పార్టీలకు ఓటు వేయొద్దు. తెలంగాణలో గ్రామ గ్రామాన పర్యటిస్తా. ప్రపంచంలో నాలాంటి వ్యక్తి ఒక్కరూ కూడా లేరు. నా ప్రతిభ గురించి తెలిసే మోదీ, కేసీఆర్, జగన్ భయపడతారు. కేఏ పాల్ తమ ప్రత్యర్థి అని కేటీఆర్ ఇకనైనా గుర్తించాలి. వచ్చే ఎన్నికల్లోపు దేశమంతా పర్యటిస్తా. ఇప్పటివరకూ 18 పార్టీల నాయకులను కలిపేశాను. ప్రతి ఒక్కరినీ కలుపుకొంటూ పోవాలన్నదే నా అభిమతం. రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి తెలంగాణలో 72, ఆంధ్రప్రదేశ్‌లో 102 సీట్లు వస్తాయి’’ అని కేఏ పాల్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని