KS Eshwarappa: కాంట్రాక్టర్‌ సూసైడ్‌ కేసు.. కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప రాజీనామా

కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి, భాజపా నేత కేఎస్‌ ఈశ్వరప్ప తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను.....

Updated : 15 Apr 2022 22:05 IST

బెంగళూరు: కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి, భాజపా నేత కేఎస్‌ ఈశ్వరప్ప తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైకి శుక్రవారం అందజేశారు. మంత్రి వేధింపుల వల్లే గుత్తేదారు సంతోష్‌ పాటిల్‌ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో ఈశ్వరప్ప తన మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలతో పాటు పలు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో కొన్ని రోజులుగా కర్ణాటకలో రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం సాయంత్రం ఈశ్వరప్ప తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈరోజు శివమొగ్గలో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో సమావేశమైన ఆయన.. తనపై కుట్రపూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారని, వీటి నుంచి నిర్దోషిగా బయటపడి మళ్లీ మంత్రి పదవి చేపడతానని విశ్వాసం వ్యక్తంచేశారు. అక్కడి నుంచి బెంగళూరులోని సీఎం అధికారిక నివాసానికి చేరుకున్న ఈశ్వరప్ప ముఖ్యమంత్రికి తన రాజీనామా లేఖను అందజేశారు. అయితే, సీఎం నివాసానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన ఈశ్వరప్ప మద్దతుదారులు ఆయన రాజీనామా చేయొద్దంటూ కాంగ్రెస్‌ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని