Kishan Reddy: ఎంపీ సోయం బాపూరావు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం: కిషన్‌రెడ్డి

తెలంగాణలో వరదలతో జనం అల్లాడుతుంటే ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు.

Updated : 31 Jul 2023 12:06 IST

హైదరాబాద్: తెలంగాణలో వరదలతో జనం అల్లాడుతుంటే ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు. విపత్తు వేళ ఆదుకునేందుకు రాష్ట్రం వద్ద రూ.900కోట్ల‌కుపైగా కేంద్రం డిపాజిట్లు ఉన్నాయని.. అయినా తాత్కాలిక సాయం కూడా అందించలేకపోయారని విమర్శించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు సంజీవరావు, శ్రీదేవిలు కిషన్‌రెడ్డి సమక్షంలో భాజపాలో చేరారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్, భారాస, మజ్లిస్‌ పార్టీలు ఒకే తాను ముక్కలని కిషన్‌రెడ్డి విమర్శించారు. అవినీతి, కుటుంబ పార్టీలకు ప్రజలే బుద్ధి చెప్పాలని కోరారు. వరదల వేళ ప్రజలను ఆదుకోవడంలో కేసీఆర్‌ ప్రభుత్వం విఫలమైందన్నారు. గిరిజన రిజర్వేషన్లపై ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని.. వాటితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే లంబాడీలకు భాజపా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. తొమ్మిదేళ్ల భారాస పాలనలో గిరిజనులకు అన్యాయం జరిగిందని విమర్శించారు. జనాభా ప్రాతిపదికన గిరిజన రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో సమష్టిగా పనిచేసి భారాసను ఓడిస్తామని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని